
ఢిల్లీ ఆహార మంత్రిపై వేటు
అవినీతి ఆరోపణలపై అసీమ్‌ను తప్పించిన కేజ్రీ
బిల్డర్ నుంచి రూ. 6 లక్షల లంచం తీసుకున్నట్లు ఆరోపణ
సాక్షి, న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై ఢిల్లీ ఆహార-పౌరసరఫరాలు, పర్యావరణ మంత్రి అసీమ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేజ్రీవాల్ శుక్రవారం మంత్రి పదవి నుంచి తప్పించారు. ఒక బిల్డర్ నుంచి అసీమ్ రూ. 6 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు హడావుడిగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు. ఈ ఉదంతంపై దర్యాప్తు జరపాలని సీబీఐని కోరామన్నారు. అసీమ్ స్థానంలో తొలిదఫా ఎమ్మెల్యే అయిన ఇమ్రాన్ హుసేన్‌ను నియమించినట్లు వెల్లడించారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిని ఉపేక్షించదు. అవినీతిపరుడైతే మంత్రి అయినా, నా కొడుకైనా, ఎవరైనా సరే సహించం. సిసోడియా(డిప్యూటీ సీఎం)అవినీతికి పాల్పడితే చర్య తీసుకుంటా. నేను అవినీతికి పాల్పడితే సిసోడియా చర్య తీసుకుంటారు’ అని స్పష్ట ంచేశారు.
‘అవినీతి ఆరోపణలపై ఒక మంత్రిని ఎవరూ కోరకుండానే తప్పించడం ఇదే తొలిసారి. అసీమ్‌పై గురువారం రాత్రి ఫిర్యాదు అందింది. బిల్డర్, అసీమ్, దళారి మధ్య జరిగినట్లు పేర్కొంటున్న ఆడియో టేపును ఫిర్యాదుదారు అందించారు. నేను, సిసోడియా దాన్ని విని ఆరోపణలు బలంగా ఉన్నాయని తేల్చాక ఈ నిర్ణయం తీసుకున్నాం. అవినీతి ఆరోపణలున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్ సీఎంలపై బీజేపీ మాలాగే చర్య తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఆడియో టేపులో కొంత భాగాన్ని సీఎం విలేకర్ల సమావేశంలో వినిపించారు.
తననియోజకవర్గమైన మతియా మహల్‌లో బిల్డర్ చేపడుతున్న భవన నిర్మాణాన్ని అసీమ్ అడ్డుకున్నారని, రూ. 6 లక్షలు చెల్లించాక అనుమతించారని ఆ టేపులో ఉంది. శుక్రవారం ఉదయం కేజ్రీవాల్.. అసీమ్‌ను పిలిపించి టేప్ విషయం చెప్పాక, అసీమ్ తప్పు ఒప్పుకున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. కాగా, తనపై విపక్షం భారీ కుట్రపన్నిందని, ఆ కుట్రను శనివారం బయటపెడతానని అసీమ్ చెప్పారు. విచారణ పెండింగ్‌లో ఉంది కనుక రాజీనామా చేయాలని పార్టీ చెప్పడంతో రాజీనామా చేశానన్నారు. కాగా, మంత్రి తొలగింపు.. తాను నిజాయితీపరుణ్నని చెప్పుకోవడానికి కేజ్రీవాల్ చేసిన యత్నమని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ మాకెన్ ఆరోపించారు. నకిలీ డిగ్రీ కేసులో ఢిల్లీ న్యాయమంత్రి జితేందర్‌సింగ్ తోమర్ జూన్‌లో రాజీనామా చేయడం తెలిసిందే.