లగడపాటి పిటిషన్ పై విచారణకు ఢిల్లీ హైకోర్టు అనుమతి!
రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తాను సమర్పించిన రాజీనామాను లోకసభ స్పీకర్ ఆమోదించాలని ఎంపీ లగడపాటి రాజగోపాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ కోర్టు అనుమతించింది.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆగస్టు 2 తేదిన స్పీకర్ మీరా కుమార్ కు రాజీనామాను సమర్పించారు. రాజీనామా సమర్పించిన తర్వాత బలవంతంగా కొనసాగించాల్సిన నిబంధన రాజ్యాంగంలో లేదని ఆయన తరపు న్యాయవాది సీనియర్ జయంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు.
లగడపాటి రాజీనామా సమర్పిస్తే.. స్పీకర్ ఆమోదించాల్సిందేనని జయంత్ అన్నారు. రాజీనామాకు దారి తీసిన కారణాలపై స్పీకర్ దృష్టి సారించాల్సిన అవసరం లేదని జయంత్ అభిప్రాయపడ్డారు. రాజీనామా విషయంపై నెలకొన్న వివాదంపై కోర్టు విచారణ చేపట్టవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తున్నాం అని జస్టిస్ జైన్ తెలిపారు.
రాజగోపాల్ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 22 తేదికి వాయిదా వేశారు. గత రెండు నెలలుగా తన రాజీనామాపై స్పీకర్ స్పందించడం లేదని తన పిటిషన్ తెలిపారు. ఎలాంటి ఒత్తిడి లేకుండానే తన సభ్యత్వానికి రాజీనామా చేసి.. స్పీకర్ అందచేశానని పిటిషన్ లో రాజగోపాల్ తెలిపారు. ఈ వ్యవహారంలో తగిన న్యాయపరమైన సూచలను అందించాలని అడిషినల్ సొలిసిటర్ జనరల్ రాజీవ్ మెహ్రాను జస్టిస్ వీకే జైన్ కోరారు.