మహిళా జర్నలిస్టుపై దాడి..పరిస్థితి విషమం
న్యూడిల్లీ: ఢిల్లీలో మహిళా జర్నలిస్టుపై దాడి చేసింది. ఈవినింగ్ వాక్ కోసం వెళ్లిన ఫ్రీలాన్స్ జర్నలిస్టు అపర్ణ కల్రా(45) గుర్తు తెలియని వ్యక్తి దాడిచేశాడు. దీంతో ఆమెతీవ్రంగా గాయపడ్డారు. తలకు తీవ్రమైన గాయం కావడంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీ అశోక్ విహార్ లో పబ్లిక్ పార్క్‌లో బుధవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి అపర్ణపై దాడి చేశాడు. ఇనుపరాడ్ తో బలంగా కొట్టడంతో సంఘటనా స్థలంలో అపర్ణ అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
మెదడుకు మల్టిపుల్ గాయాలు కావడంతో ఫోర్టిస్ ఆస్పత్రిలో వైద్యులు ఒక శస్త్రచికిత్స నిర్వహించారనీ, కానీ పరిస్థితి విషమంగా ఉందనీ అపర్ణ బంధువు భాటియా తెలిపారు. సెల్ ఫోన్ చోరీ కోసం దాడి జరిగి ఉంటుందని మొదట అనుమానించామనీ, కానీ ఆమె ఫోన్ ఇంట్లోనే వదిలి వాకింగ్ వెళ్లారని చెప్పారు.ఆమె దగ్గర ఇతర విలువైన వస్తువులు ఏమీ లేవని చెప్పారు.
హత్యా యత్నం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్టు డిసిపి (నార్త్-వెస్ట్)మిలింద్ డుంబ్రే చెప్పారు. ముక్కు, తలనుంచి తీవ్ర రక్త స్రావంతో పడివున్న ఆమెపై తమకు సమాచారం అందిందని తెలిపారు. వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చామన్నారు. దాడిచేసిన వారి గురించి తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు.
కాగా ఫ్రీ జర్నలిస్టుకాక ముందు అపర్ణ చాలా జాతీయ దినపత్రికల్లో పనిచేశారు.