ఆ ఖాతాల్లోకి రూ.64,250కోట్ల డిపాజిట్లు!
ఆ ఖాతాల్లోకి రూ.64,250కోట్ల డిపాజిట్లు!
Published Fri, Nov 25 2016 7:24 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM
రూపాయి కూడా వేయాల్సిన అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్ రూపంలో తెరుచుకున్న జనధన యోజన ఖాతాల్లోకి కోట్ల కొద్దీ డబ్బు కుప్పలు తెప్పలుగా జమఅవుతోంది. నిన్న కాక మొన్న ఈ ఖాతాల్లోకి 21 వేల కోట్ల రూపాయల డిపాజిట్లు అయినట్టు వెల్లడవగా.. ప్రస్తుతం ఈ డిపాజిట్లు మరింత పెరిగినట్టు తెలిసింది. నేటికి జన్ధన్ ఖాతాల్లోకి రూ.64,250 కోట్లు డిపాజిట్ అయినట్టు ప్రభుత్వం నేడు లోక్ సభకు వెల్లడించింది. ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా రూ.10,670.62 కోట్లు డిపాజిట్ అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఉత్తరప్రదేశ్ తర్వాతి స్థానంలో పశ్చిమబెంగాల్ ఉన్నట్టు తెలిపింది. నవంబర్ 16వరకు 25.58 కోట్ల జన్ధన్ అకౌంట్లలో అగ్రిగేట్గా రూ.64,252.15 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్సభకు సమర్పించిన ఓ లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంక్ ఎకౌంట్లు లేని కోట్లాది ప్రజలను ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం దాదాపు 23 కోట్ల మందిచే జన్ధన్ అకౌంట్లను ఓపెన్ చేపిస్తూ 2014 ఆగస్టు నెలలో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు వాళ్లు బ్యాంకు ఖాతా తెరవడమే తప్ప.. అందులో పెద్దగా డబ్బులు వేసింది, తీసింది ఏమీ లేదు. కానీ ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించగానే ఈ ఖాతాల్లోకి డబ్బుల వెల్లువ కొనసాగుతోంది. మధ్య దళారులు అమాయక ప్రజలను మభ్యపెట్టి వారి ఖాతాల్లోకి డబ్బును డిపాజిట్ చేస్తున్నారు. తమ దగ్గర భారీ మొత్తంలో ఉన్న నల్లధనాన్ని వైట్గా మార్చుకోవడానికి ఈ ఖాతాలను వాడుకుంటున్నారని తెలిసింది. మంచి ఉద్దేశ్యంతో ప్రారంభమైన ఈ పథకం, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొంత మేర దుర్వినియోగం అవుతున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement