రూ. 20 కోట్ల ముడుపులు అందాయి అందుకే...
విజయవాడ: అగ్రిగోల్డ్ సంస్థ నుంచి కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రికి రూ. 20 కోట్లు ముడుపులు అందాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) ఆరోపించారు. అందుకే సదరు మంత్రిగారు బాధితుల తరఫున నోరు మెదపడం లేదని విమర్శించారు. మంగళవారం దేవినేని నెహ్రూ విజయవాడలో మాట్లాడారు. చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్న బృందంలో ఆర్థిక నేరగాళ్లు ఉన్నారన్న సంగతి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
నేరగాళ్లు, చినబాబు అనుచరులే విదేశాలకు వెళ్తున్నారని దేవినేని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నారై పారిశ్రామికవేత్తలతో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్ సమావేశం అవుతున్నారు. అందుకోసం నారా లోకేశ్ ఆదివారం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. అమెరికా పర్యటనలో భాగంగా మే 7వ తేదీన దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో నారా లోకేశ్ సమావేశం కానున్నారు.
అదికాక అగ్రిగోల్డ్ తమను నిలువునా ముంచిందంటూ బాధితులు సోమవారం విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు బాధితుల ర్యాలీని అడ్డుకుని... బాధితులను పోలీసు స్టేషన్ కు తరలించారు. మంగళవారం పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ సంస్థ కార్యాలయం ఎదుట బాధితులు ధర్నా నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు రూ. 7 వేల కోట్లు మేర డిపాజిట్లు చేశారు. అనంతరం అగ్రిగోల్డ్ బోర్డు తిప్పేసింది. ఇంత జరిగిన ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ ప్రజల తరపున నోరు మెదపకపోవడంతో దేవినేని నెహ్రూపై విధంగా స్పందించారు.