శాంసంగ్కు ఊరటనిచ్చిన డీజీసీఏ
న్యూఢిల్లీ: గెలాక్సీ నోట్ 7 , నోట్ 2 బ్యాటరీ పేలుళ్ల ప్రమాదాలతో చిక్కుల్లో పడిన కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ కు డీజీసీఏ భారీ ఊరట నిచ్చింది. భారత విమానాల్లో ఉపయోగించే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్లపై విధించిన నియంత్రణలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ఎత్తివేసింది. అయితే సెస్టెంబర్ 15 తరువాత కొన్ని గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్లకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని వివరించింది. అంతకుముందు కొనుగోలు చేసిన నోట్ 7 ఫోన్లపై నిషేధాజ్ఞలు యధావిధగా అమలవుతాయని రెగ్యులేటరీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
కాగా గెలాక్సీ నోట్ 7 చార్జింగ్ సమయంలో బ్యాటరీ పేలుళ్ల ఘటనలతో ప్రపంచవ్యాప్తంగా శాంసంగ్ ఇబ్బందుల్లో పడింది. ఈ పేలుళ్లను ధృవీకరించిన సంస్థ వీటిని రీకాల్ చేసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ దేశీయ విమానాల్లో ఈ ఫోన్ల వాడకంపై నిషేధాజ్క్షలు విధించింది. మరోవైపు ఇటీవల చెన్నై విమానాశ్రయంలో ఇండిగో విమానం లాండ్ అవుతున్న సందర్భంగా నోట్2 స్మార్ట్ ఫోన్ కారణంగా పొగలు వ్యాపించడం ఆందోళన రేపింది. ఈనేపథ్యంలో డీజీసీఏ నోటీసులు జారీ చేయడంతో శాంసంగ్ అధికారులే డీజీసీఏ అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే.