నయనతార డెడికేషన్‌కు భయపడ్డా
చెన్నై : నటి నయనతార డెడికేషన్ తనను భయపెట్టిందని నటుడు విజయ్‌సేతుపతి తెలిపారు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం నానుమ్ రౌడీదాన్. పోడాపోడీ చిత్రం తరువాత యువ దర్శకుడు విఘ్నేశ్ శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వుండర్‌మార్ ఫిలింస్ పతాకంపై నటుడు ధనుష్ నిర్మిస్తున్నారు.
పార్తీపన్, రాధిక శరత్‌కుమార్, మన్సూర్ అలీఖాన్, అళగు పెరుమాళ్, ఆర్.బాలాజీ తదితరులు ముఖ్యపాత్రలు ధరించిన నానుమ్ రౌడీదాన్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. చిత్రం 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం మధ్యాహ్నం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు విఘ్నేశ్ శివ మాట్లాడుతూ మంచి కథతో కామెడీ బేస్డ్ చిత్రం చేయాలనుకున్నానన్నారు.
అలాంటి కథ తయారు చేసుకుని వేరే హీరో కోసం ప్రయత్నిస్తున్నాను కథ వినమని నటుడు విజయ్ సేతుపతిని అడిగానన్నారు. విన్న తరువాత తను బాగుంది అని అన్నారన్నారు. అలా చిత్రంలో నటించిన అందరికీ కథ చెప్పగా అందరూ బాగుందన్నారనీ ఆ తరువాత విజయ్ సేతుపతితో ఈ చిత్రంలో హీరోగా మీరే నటించాలని అడగడంతో ఆయన ఓకే అన్నారని చెప్పారు. అలా నానుమ్ రౌడీ దాన్ చిత్రం మొదలై ఇప్పుడు తాము ఊహించిన దానికంటే మంచి చిత్రం తయారైందని అన్నారు.
ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సంగీత దర్శకుడు అనిరుధ్ కృషి చాలా ఉందన్నారు. చిత్ర హీరో విజయ్ సేతుపతి మాట్లాడుతూ ధనుష్‌తో కలిసి పదుపేట్టై చిత్రంలో నటించానన్నారు. అలాంటిది ఇప్పుడు ఆయన నిర్మించిన ఈ నానుమ్ రౌడీదాన్ చిత్రంలో కథానాయకుడిగా నటించడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు విఘ్నేశ్ శివ చిత్రాన్ని చాలా ఆసక్తిగా మలచారని అన్నారు. ఇక నయనతారతో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు.
ఆమె డెడికేషన్ చూసి మొదట్లో భయపడ్డాననీ తను మాత్రం ఎలాంటి భేషజాలు చూపకుండా నటించారని అన్నారు. తాను షూటింగ్‌లో కొంచెం గ్యాప్ వస్తే క్యారవాన్‌లో కూర్చునే వాడినని నయనతార మాత్రం ఎంత విరామం వచ్చినా షూటింగ్ స్పాట్‌లోనే ఉండేవారని అన్నారు. అంత డెడికేషన్‌తో నటించే నటి నయనతార అని విజయ్ సేతుపతి అన్నారు. ఈ సమావేశంలో పార్తీపన్, మన్సూర్ అలీఖాన్, ఆర్ బాలాజీ తదితరులు పాల్గోన్నారు.