
'మిస్టర్ కూల్'లో ఈ తీవ్ర ఆగ్రహాన్ని చూశారా?
'మిస్టర్ కూల్' మహేంద్రసింగ్ ధోనీ మరోసారి తన 'మ్యాజికల్ ఇన్నింగ్స్'తో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇటు ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), అటు హార్దిక్ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించడంతో భారత్ 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో హాఫ్ సెంచరీల సెంచరీ కొట్టిన క్రికెటర్‌గా ధోనీ ఘనత సొంతం చేసుకున్నారు. గతంలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ తదితర భారత క్రికెటర్లు ఈ ఘనత సొంతం చేసుకున్నారు.
కానీ, ధోనీని ప్రారంభంలోనే రన్నౌట్ చేసే అవకాశాన్ని ఆస్ట్రేలియా చేజార్చుకుంది. కేదార్ జాధవ్ అజాగ్రత్త వల్ల ధోనీ రన్నౌట్ అయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. కానీ, అదృష్టం బాగుండి తృటిలో బయటపడటం.. టీమిండియాకు కలిసొచ్చింది. ఈ సమయంలో ప్రశాంతతకు మారుపేరుగా ఉండే ధోనీ ఒక్కసారిగా తనలోని ఉగ్రరూపాన్ని చూపెట్టాడు. కేదార్ జాధవ్‌ను ఉరిముతూ చూడటం కెమెరా కంటపడింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. కష్టాల్లో ఉన్న సమయంలో ధోనీ బ్యాటింగ్‌కు వచ్చాడు. 22వ ఓవర్‌లో ధోనీ 7 పరుగుల వద్ద ఉండగా రన్నౌట్ అయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. బంతిని కవర్ దిశగా మళ్లించిన ధోనీ వెంటనే పరుగుకు ఉపక్రమించాడు. కానీ, మరో ఎండ్‌లో ఉన్న కేదార్ జాదవ్ మాత్రం స్పందించలేదు. దీంతో మైదానంలో మధ్యలోకి వెళ్లిన ధోనీ కాస్తా తడబడి.. తిరిగి వెనక్కి మళ్లే ప్రయత్నంచేశాడు. ఇంతలో బంతి అందుకున్న హిల్టన్ కార్ట్‌రిట్ హడావిడిగా వికెట్ల వైపు బంతి విసిరాడు. బంతి కాస్తా వికెట్లను తాకకుండా ఓవర్ త్రో అయింది. దీంతో ధోనీ పరుగు తీశాడు. కానీ పరుగు తీసిన అనంతరం కేదార్‌ను ధోనీ ఉరుముతూ ఆవేశంతో చూశాడు. ఇదేమీ తీరు అన్నట్టు తల పంకించాడు. ఆ వెంటనే 40 పరుగులు చేసిన కేదార్ మార్కస్ బౌలింగ్‌లో కార్ట్‌రిట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం గమనార్హం. కానీ, 'మిస్టర్ కూల్' ధోనీ ఇలా ఉగ్రరూపంతో చూడటం అభిమానుల దృష్టి ఆకర్షించింది. ధోనీ ఎంత కోపంగా చూశాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.