కాపీ కొట్టిన ట్రంప్ గారి భార్య!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ సతీమణి మెలినియా ట్రంప్ తనను తాను అమెరికా ప్రజలకు పరిచయం చేసుకునేందుకు ఇచ్చిన ఉపన్యాసం విమర్శలపాలవుతున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ భార్య, మాజీ మోడల్ మెలినియా (46) రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో సోమవారం ప్రసంగించారు. ఒక భర్తగా, తండ్రిగా, సమర్థమైన నాయకుడిగా తన భర్త గొప్పతనాన్ని వివరిస్తూ ఆమె ఉపన్యసించారు.
అయితే, తన జీవితాన్ని నిర్దేశించిన విలువల గురించి ఆమె పేర్కొన్న వ్యాఖ్యలు మక్కీకిమక్కీ మిషెల్లీ ఒబామా ఉపన్యాసాన్ని పోలి ఉండటం గమనార్హం. అధ్యక్ష ఎన్నికలకు ఒబామా పోటీచేసినప్పుడు 2008లో డెమొక్రటిక్ పార్టీ సదస్సులో మిషెల్లీ ఇచ్చిన ఉపన్యాసాన్ని దాదాపుగా మెలినియా తిరిగి వల్లేవేయడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
తన తల్లిదండ్రులు తనకు నేర్పిన సామాజిక, నైతిక విలువలు, ఎదుటివారిని గౌరవించడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం వంటివి ఇప్పటికీ తనతోపాటు నిలిచి ఉన్నాయని మెలినియా పేర్కొనగా.. 2008లో మిషెల్లీ కూడా ఇదే తరహాలో కుటుంబ, నైతిక, సామాజిక విలువల గురించి తెలుపడంతో ఆమె ఉపన్యాసాన్ని మెలినియా కాపీ కొట్టిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.