
కాంగ్రెస్‌లో గందరగోళం
తమిళనాడు కాంగ్రెస్‌లో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ప్రకటన గందరగోళానికి దారితీసింది.
- బలపరీక్షలో పార్టీ వైఖరిపై సందిగ్ధత
- అధిష్టానం నిర్ణయం మేరకే పయనం: తిరునావుక్కరసర్
- ఏఐఏడీఎంకేలో చేరేందుకే అలా వ్యవహరిస్తున్నారు: ఇళంగోవన్
సాక్షి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌లో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ప్రకటన గందరగోళానికి దారితీసింది. బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి డీఎంకే నిర్ణయించగా, అందుకు భిన్నంగా తిరునావుక్కరసర్ చర్యలు ఉండడం తమిళ కాంగ్రెస్‌లో మరోమారు వివాదానికి దారితీసింది. రాయపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం సత్యమూర్తిభవన్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సమావేశమైంది.
అనంతరం తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానంపై అందరి అభిప్రాయాలు ఢిల్లీకి పంపుతున్నామని తెలిపారు. తమ అధిష్టానం నిర్ణయం మేరకు పయనమని చెప్పారు. కాంగ్రెస్ భవిష్యత్తును దృష్టితో పెట్టుకొని చర్చ సాగిందని, ఇందుకు తగ్గట్టు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి తెలిపారు. అయితే తిరునావుక్కరసర్ వైఖరిని సీనియర్లు తీవ్రంగా ఖండించారు. తిరునావుక్కరసర్ త్వరలో అన్నాడీఎంకేలో చేరబోతున్నారని, అందుకే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మండిపడ్డారు. డీఎంకేతో మిత్రభేదం లక్ష్యంగా ఆయన చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
గత వారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాను, చిదంబరం, కేఆర్ రామస్వామి, తంగబాలు, మణిశంకర్ అయ్యర్ పాల్గొన్నామని వివరించారు. డీఎంకే తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు. అయితే, ఇప్పుడు తిరునావుక్కరసర్ చర్యలు చూస్తుంటే, ఎమ్మెల్యేల్ని గందరగోళానికి గురిచేయడానికి సిద్ధపడ్డట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం ఇప్పటికే తన నిర్ణయాన్ని స్పష్టం చేసిందని, అందుకు తగ్గట్టు ఎమ్మెల్యేలు నడుచుకోవాలని ఆయన కోరారు. డీఎంకే నిర్ణయం మేరకే తమ అడుగులని సమావేశానికి ముందు మీడియాతోనూ, ట్విట్టర్‌లోనూ పేర్కొన్న తిరునావుక్కరసర్, సమావేశానంతరం మాట మార్చడం గమనార్హం.