* ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు విద్యాశాఖ ఏర్పాట్లు
* ‘డిజిటల్ ఇండియా’ కింద 100 స్కూళ్లలో అమలు
* మరో 2,157 స్కూళ్లలో అమలుకు కసరత్తు
* ఇప్పటికే 4, 5 తరగతుల్లో సైన్స్ డిజిటల్ పాఠాలు
* మిగతా తరగతుల కోసం పాఠాల రూపకల్పనకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు బోధించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు శుక్రవారం ‘కంప్యూటర్ విద్య, డిజిటల్ పాఠాల’పై పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4, 5 తరగతుల్లో పర్యావరణ విద్యకు సంబంధించి కరీంనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు డిజిటల్ పాఠాలను రూపొందించారు. మిగతా తరగతులకు సంబంధించిన డిజిటల్ పాఠాలను కూడా రూపొందించే దిశగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
జిల్లాకు 10 చొప్పున రాష్ట్రంలోని 100 స్కూళ్లలో కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ పథకం కింద డిజిటల్ పాఠాలను బోధించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్కూళ్లలో కార్పొరేట్ సంస్థలు ఈ విద్యను అందించేలా చర్యలు చేపడుతున్నారు. వారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వ టీచర్లకు కూడా డిజిటల్ పాఠాల రూపకల్పన, బోధనపైనా శిక్షణ ఇప్పించాలని విద్యాశాఖ భావిస్తోంది. తద్వారా ఇప్పటికే ఇంటర్నెట్ సదుపాయంతో కూడిన కంప్యూటర్లు అందుబాటులో ఉన్న 2,157 స్కూళ్లలో ‘డిజిటల్ పాఠాల’ను బోధించాలని నిర్ణయించింది. వీటిల్లోని 450 స్కూళ్లలో ప్రస్తుతం ప్రొజెక్టర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
మిగతా స్కూళ్లకు ప్రొజెక్టర్లను కొనుగోలు చేయనున్నారు. దీంతోపాటు ప్రభుత్వ టీచర్లకు స్పోకెన్ ఇంగ్లిషుపైనా 6 నెలలపాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇందులో 10 రోజులు నేరుగా తరగతులను నిర్వహిస్తారు, మిగతా రోజుల్లో ఆన్‌లైన్ ద్వారా శిక్షణ ఇస్తారు. దీనిద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లకు ఇంగ్లిషుతోపాటు డిజిటల్ పాఠాల బోధన కూడా సులభం అవుతుందని విద్యాశాఖ భావిస్తోంది.
ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ పాఠాలు
Published Sat, Aug 15 2015 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement