
సర్వేనా? రాజయ్యా..?
వరంగల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై దిగ్విజయ్ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ కసరత్తు చేస్తున్నారు. వరంగల్ లోక్‌సభ పరిధిలోని మండలస్థాయి నాయకులతో దిగ్విజయ్ గురువారం విడివిడిగా సమావేశమై అభిప్రాయ సేకరణ చేశారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడి స్థాయి నుంచి, బ్లాక్, నియోజకవర్గ స్థాయి నేతలతో విడివిడిగా సమావేశమై రాతపూర్వకంగా అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ అభిప్రాయ సేకరణలో దిగ్విజయ్‌సింగ్‌తోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.
జి.వివేక్, సర్వే సత్యనారాయణ, సిరిసిల్ల రాజయ్య, రాజారపు ప్రతాప్ పేర్లపై స్థానిక నేతల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఈ ఉప ఎన్నికలో పోటీచేయబోనని, వచ్చే ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి మాత్రమే అభ్యర్థిగా ఉంటానని మాజీ ఎంపీ జి.వివేక్ స్పష్టంగా చెప్పారు. దీంతో మిగిలిన ముగ్గురు అభ్యర్థులపై అభిప్రాయాలు సేకరించారు. రాజారపు ప్రతాప్‌కు అభ్యర్థిత్వంపై తక్కువ మంది మొగ్గుచూపుతున్నారని టీపీసీసీ ముఖ్యులు వెల్లడించారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు పోటీ మిగిలింది. వీరిద్దరి బలాబలాలపై దిగ్విజయ్ చర్చించారు. నియోజకవర్గంలో సర్వేకు ఎక్కువగా పరిచయాలు లేకపోవడం, స్థానిక నేతలతో సంబంధాలు లేకపోవడం వంటి ఇబ్బందులు ఉన్నాయని అధిష్టానం భావిస్తోంది.
గత ఎన్నికలో భారీ తేడాతో ఓడిపోవడం, క్షేత్రస్థాయిలో మంచి అభిప్రాయం లేకపోవడం వంటి సమస్యలు రాజయ్యతో ఉన్నాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో పోటీచేయడం వల్ల విస్తృతమైన పరిచయాలు రాజయ్యకు ఉన్నా ఆర్థికంగా అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే సామర్థ్యంపై పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అయితే గురువారం సాయంత్రమే ఢిల్లీకి వెళ్లిపోయిన దిగ్విజయ్ దీనిపై శుక్రవారం ప్రకటన చేసే అవకాశముంది. ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీతో శుక్రవారం సమావేశమైన తర్వాత అభ్యర్థిపై ప్రకటన చేయనున్నారు. అభ్యర్థి ఎంపికకోసం ఏ పార్టీలో లేని విధంగా మండలస్థాయి నుంచి అభిప్రాయాలను తీసుకుంటున్నామని, త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని ఢిల్లీ వెళ్లడానికి ముందు దిగ్విజయ్ విలేకరులకు చెప్పారు.