దేశ రాజధాని ఢిల్లీలో ఒక మహిళను హత్యచేసి, ఆమె మూడేళ్ల కుమారుడిని అపహరించిన నేరానికి గాను ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. దిగ్విజయ్ (23), సచిన్ (20) అనే వీరిద్దరూ మోహి (29) అనే మహిళను హత్య చేసి, ఆమె కుమారుడు ఇషును అపమరించడమే కాక, వాళ్ల ఇంటిని దోచుకున్నారని పోలీసులు తెలిపారు. ఢిల్లీ, ఉత్తరాఖండ్ పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్ పుణ్యమాని హరిద్వార్లో ఉన్న బాలుడిని సురక్షితంగా కాపాడినట్లు ఢిల్లీ జాయింట్ పోలీసు కమిషనర్ సంజయ్ బేణీవాల్ తెలిపారు.
అయితే, బాలుడిని కాపాడే ప్రయత్నంలో ఉన్నపోలీసులపై నిందితులు కత్తితో దాడి చేయడంతో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. నిందితులిద్దరిలో దిగ్విజయ్ గతంలో పిల్లవాడి తండ్రి ఇనాముల్లా నడిపే మొబైల్ దుకాణంలో పనిచేసేవాడు. బాగా డబ్బు అవసరం కావడంతో సచిన్, కేశవ్ అనే ఇద్దరితో కలిసి ఈ కుట్ర పన్నాడు. శనివారం ఉదయం ఇంట్లో పనిమనిషి బీనా ఉండగానే ఆమెను తుపాకి చూపించి బెదిరించి, మోహిని పొడిచి చంపి, ఆమె కుమారుడిని ఎత్తుకుపోయారు. సంఘటన జరిగిన వెంటనే ఢిల్లీ వదిలిపెట్టి ఉత్తరాఖండ్ పారిపోయారు. బాలుడిని అడ్డం పెట్టుకుని డబ్బు కోసం అతడి తండ్రి ఇనాముల్లాకు పలుమార్లు ఫోన్లు చేశారు. వీళ్ల గురించి విశ్వసనీయంగా సమాచారం అందడంతో పోలీసులు వాళ్లెక్కడున్నదీ కనిపెట్టారు.
ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఎస్ఐ అరుణ్, ఉత్తరాఖండ్ పోలీసు కానిస్టేబుల్ వివేక్ బాలుడిని కాపాడుతుండగా వారి చేతులపైన, నడుంపైన కత్తి గాయాలయ్యాయి. వారి పేర్లను రివార్డుల కోసం ప్రతిపాదిస్తామని బేణీవాల్ చెప్పారు. మూడో నిందితుడు కేశవ్ కోసం గాలింపు కొనసాగుతోంది.
మహిళ హత్య కేసులో దిగ్విజయ్, సచిన్ అరెస్టు
Published Wed, Aug 28 2013 10:01 PM | Last Updated on Sun, Sep 2 2018 4:37 PM
Advertisement
Advertisement