బడ్జెట్ సెషన్లో పళనికి చెక్
చెన్నై : తమిళనాడులో రాజకీయాలు మరింత హీటెక్కే దిశగా కదులుతున్నాయి.. ఎలాగైనా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోసి, తాజా ఎన్నికలు వెళ్లాలని డీఎంకే నిర్ణయించింది. మధ్యంతర ఎన్నికలతో మళ్లీ పవర్ లోకి వచ్చేయాలని తెగ ప్లాన్స్ వేసేస్తోంది. అసెంబ్లీలో తీవ్ర ఆందోళనల నేపథ్యంలో బలనిరూపణలో నెగ్గి, సీఎం పదవిలోకి వచ్చిన పళనికి మార్చిలో జరుగబోయే బడ్జెట్ సెషన్లో చెక్ పెట్టాలని డీఎంకే నిర్ణయించేసింది. ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టి, అసెంబ్లీలో జరిగిన రాజకీయ హైడ్రామాను ప్రజలకు వివరిస్తామని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సోమవారం పేర్కొన్నారు.
విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర అక్రమ పద్ధతులు చోటుచేసుకున్నాయని డీఎంకే ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గత శనివారం జరిగిన అసెంబ్లీ సెషన్లో తీవ్ర ఆందోళనల నేపథ్యంలోనే పళని తన బలపరీక్షను నెగ్గి, తమిళ నాడు సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం సృష్టించిన భయానక వాతావరణం, అన్నాడీఎంకే తప్పుడు ధోరణిని ప్రజలోకి తీసుకెళ్తామని డీఎంకే హెచ్చరిస్తోంది.అంతేకాక బడ్జెట్ సెషన్లోనూ ప్రభుత్వాన్ని కూలదోయాలని పన్నాగాలు పన్నుతోంది. వచ్చే 90రోజుల్లో రాష్ట్ర వ్యయానికి సంబంధించి అన్నాడీఎంకే ప్రభుత్వం కనీసం 50 నుంచి 60 మనీ బిల్లులను అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతుందని, కానీ ఒక్క బిల్లును కూడా తాము ఆమోదించమని డీఎంకే ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు.