సాక్షి, చెన్నై: ఆర్థిక కష్టాల నేపథ్యంలో పొదుపుగా నిధుల్ని వాడుకోవాలని సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాలినట్టు సమాచారం. దీంతో ఆయా శాఖల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులకు సభకు వచ్చే సమయంలో క్యారియర్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందనే చర్చ సాగుతోంది. ఈనెల 13న బడ్జెట్ దాఖలుతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. మరుసటి రోజున వ్యవసాయ బడ్జెట్ దాఖలు చేశారు. ఆదివారం సెలవు తదుపరి సోమవారం సభ ప్రారంభమైంది.
సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయా శాఖల వారీగా నిధుల కేటాయింపులు, చర్చలు సాగుతున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పోలీసులు అంటూ వెయ్యి మందికి పైగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయడం జరిగేది. ఇవన్నీ స్టార్ హోటళ్ల నుంచి పంపిణీ చేసేవారు. అలాగే, ఆయా శాఖల తరపున గిఫ్ట్‌లు సైతం అందజేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఖర్చు అంతా ఆయా శాఖలకు కేటాయించిన నిధుల నుంచి వాడుకోవాల్సిందే. ఇందుకోసం రోజుకు లక్షల్లో నగదు ఖర్చుపెట్టాల్సిందే.
చదవండి: Tamilnadu: వారంలో స్థానిక నగారా..?
అయితే, తాజాగా ఈ పద్ధతికి స్వస్తి పలికి ఉండటం గమనార్హం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కరోనా పుణ్యమా కష్టాల్లో ఉన్న నేపథ్యంలో నిధుల పొదుపు మీద స్టాలిన్ స్పష్టమైన ఆదేశాల్ని ఆయా శాఖల మంత్రులు, అధికారులకు ఇచ్చినట్టు సచివాల యం వర్గాల సమాచారం. దీంతో తాజా సమావేశాల్లో తొలిరోజు బడ్జెట్ చర్చలో మంత్రులకు , అధికారులకు ఎలాంటి లగ్జరీ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. గిఫ్ట్‌ల పంపిణీ కూడా జరగలేదు. ఎవరికి వారు తమ సొంత ఖర్చులతో భోజనాలు తెప్పించుకోక తప్పలేదు. కొందరు క్యాంటీన్ల బాట పట్టగా, మరికొందరు, ఇక ఇంటి నుంచే క్యారీర్లు తెచ్చుకోవాల్సిందేనా అన్నట్టుగా చలోక్తులు విసురుకోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment