లక్షల కోట్ల కుంభకోణం క్రతువుకు నేను రాలేను... | do not invite me to foundation cermony of capital city, ys jagan writes open letter to chandra babu | Sakshi
Sakshi News home page

లక్షల కోట్ల కుంభకోణం క్రతువుకు నేను రాలేను...

Published Fri, Oct 16 2015 1:59 AM | Last Updated on Fri, Sep 28 2018 7:57 PM

లక్షల కోట్ల కుంభకోణం క్రతువుకు నేను రాలేను... - Sakshi

లక్షల కోట్ల కుంభకోణం క్రతువుకు నేను రాలేను...

రాజధానికి కాదు.. ఆ పేరుతో జరుగుతున్న రియల్ వ్యాపారానికి వ్యతిరేకం
సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బహిరంగ లేఖ
అన్నదాతల కడుపుకొట్టే దోపిడీ వ్యవహారం
పేద రైతుల భూములు విదేశీ ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం
గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు, ప్రజల మనోభావాలు మీకు పట్టవు..
అమరావతి పేరుతో సాగుతున్న కుంభకోణానికి మద్దతునివ్వలేను
ఆహ్వానాలు పంపొద్దు... ఆ తర్వాత అభాండాలు వేయద్దు


సాక్షి, హైదరాబాద్: ‘‘రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించడం, ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగడం, మీకు నచ్చిన ప్రైవేటు విదేశీ కంపెనీలకు ఆ భూములను కట్టబెట్టడం, అందుకు విదేశీ కంపెనీల ద్వారా లక్షల కోట్లు తరలించడం... మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం పేరుతో సాగిస్తున్న అతిపెద్ద కుంభకోణానికి మద్దతునివ్వలేను కనుక అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రాలేను’’ అని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురువారం ఒక బహిరంగ లేఖ రాశారు. రాజధాని నిర్మాణానికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని, అయితే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మీరు సాగిస్తున్న కుంభకోణాన్ని సమర్థించలేను కనుకనే శంకుస్థాపనకు రాలేనని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అందరికీ ఆహ్వానాలు పంపిస్తామని మీరు ప్రకటించడాన్ని ప్రసార సాధనాల ద్వారా తెలుసుకున్నాననీ, అయితే మీరు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లక్షల కోట్ల అక్రమ సంపాదనకు, విదేశీ కంపెనీల ద్వారా విదేశాలకు లక్షల కోట్లు తరలించడానికి, రైతుల కడుపు కొట్టడానికి ఈ శంకుస్థాపన చేస్తున్నందున ప్రజలందరి తరఫున అలాంటి దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నామని జగన్ తెలిపారు.

రాజధాని పేరుతో జరుగుతున్న కుంభకోణానికి సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావిస్తూ శంకుస్థాపనకు రాలేకపోవడానికి జగన్ ఆ లేఖలో ఎనిమిది కారణాలను వివరించారు. అందువల్ల తనకు ఎలాంటి ఆహ్వానాలు పంపొద్దని కోరారు. ఆహ్వానం పంపినప్పటికీ జగన్ రాలేదని, ఆ తర్వాత తనపై ఒక బండ విసరొద్దని అన్నారు. మీ ఆదేశాల మేరకు ఇప్పటికే అరడజను మంది మంత్రులు చేయబోయేది అదేనన్న విషయం తనతో పాటు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసని జగన్ పేర్కొన్నారు.
 
1
ప్రజలకు ఇష్టం లేక పోయినా బలవంతంగా మీ అధికారాన్ని ఉపయోగించి రైతుల భూములు లాక్కుని, వారి ఉసురు మీద మీరు రాజధానిని కడుతున్నారు. మూడు పంటలు పండే మాగాణి భూములను పూలింగ్ పేరిట ైరె తుల మెడ మీద కత్తి పెట్టి లాక్కున్న మీ వైఖరికి వ్యతిరేకంగా ఇప్పటికే మేము పలు సందర్భాల్లో దీక్షలు చేసినా, నిరసనలు తెలిపినా మీ తీరు మారలేదు. అందుకే రాదల్చుకోలేదు.
 
2
రాజధాని ప్రాంతంలో 30వ సెక్షన్, 144వ సెక్షన్‌ను ఎందుకు అమలు చేస్తున్నారు? ప్రజలు ఆనందంతో ఉంటే మరెందుకు ఈ సెక్షన్లు అమలులో ఉన్నాయి? అక్కడ ఈ నిషేధ సెక్షన్లు గత సంవత్సర కాలంగా ఎందుకు ఉపయోగిస్తున్నారు?
 
3
గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పును బేఖాతరు చేస్తూ కోర్టును, ప్రజల మనోభావాలను లెక్క చేయని మీ వైఖరిని నిరసిస్తున్నాం.
 
4
అసైన్డ్ భూములు, పేదల భూములు అంటే చులకన భావంతో అవి మీ అత్తగారి సొత్తు అన్నట్లు, మీ ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకునే మీ మనస్తత్వానికి నిరసన తెలుపుతున్నాం.
 
5
మీ కమిషన్ల కోసం, మీ లంచాల కోసం మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ప్రజల కడుపు కొడుతున్నారు. మీకు నచ్చిన ప్రైవేటు, విదేశీ సింగపూర్ కంపెనీలకు మీ ఇష్టం వచ్చినట్లుగా భూములు ఇస్తున్న మీ వైఖరికి నిరసనగా, మీరు చేస్తున్న ఈ కుంభకోణంలో మీకు మద్దతు తెలుపకూడదనే భావనతో రాదల్చుకోలేదు.
 
6
కేంద్రం ఇప్పటికే రూ.1,850 కోట్లు రాజధాని కోసం డబ్బులు ఇచ్చింది. రింగురోడ్డు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఆంధ్రప్రదేశ్ కు ఇంకా చేస్తామని చెబుతోంది. ఈ డబ్బును ఖర్చు చేసి బిల్లులు పెట్టండి  మీ అవసరం మేరకు ఇంకా ఇస్తాం అంటోంది. విభజన చట్టం ప్రకారం మనకు ఇవ్వాల్సినవన్నీ నెరవేరుస్తాం అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నపుడు రాజధాని నిర్మాణానికి ప్రైవేటు సింగపూర్ కంపెనీలతో లేక ప్రైవేటు విదేశీ కంపెనీలతో ఏం పని?

రాజధానిలో ఉండాల్సిన హైకోర్టు, సచివాలయం, శాసనసభ, ప్రభుత్వ కార్యాలయాలకు కావాల్సింది అక్కడే ఉన్న ప్రభుత్వ భూముల్లో కట్టుకొని, రోడ్లు వేసి, జోనింగ్ చేసి ప్రజలు రియల్ ఎస్టేట్ చేసుకుంటారో లేక వారి భూములు వారే అట్టి పెట్టుకుంటారో ప్రజల ఇష్టానికి వదిలేయకుండా బలవంతంగా మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం పేద ప్రజల భూములను లాక్కోవడానికి నిరసనగా- మేం రాదల్చుకోలేదు.
 
7
మీ వాళ్లను బినామీలుగా పెట్టుకుని రాజధాని ప్రాంతంలో వందల ఎకరాలు కొనుగోలు చేయించి, ఆ భూములను వదలి వేసి పేదల భూములను మాత్రం వారికి  ఇష్టం లేక పోయినా లాక్కొన్న మీ వైఖరికి నిరసనగా రాదల్చుకోలేదు.
 
8
ప్రజల డబ్బును దుబారా చేస్తున్నారు. ఒక్క రోజు తతంగాన్ని జరిపేందుకు  దాదాపు రూ.400 కోట్లు బూడిదపాలు చేస్తున్న మీ తీరుకు నిరసన వ్యక్తం చేస్తున్నాం.
 
‘చివరిగా ఒక్క మాట... రాజధాని నిర్మాణానికి మేం వ్యతిరేకం కాదు. మీరు శంకుస్థాపన చేస్తున్నది ప్రజల రాజధానికి కాదు. పేద ప్రజల రాజధానికి అసలే కాదు, అది మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి, లక్షల కోట్ల అక్రమ సంపాదనకు, విదేశాలకు విదేశీ కంపెనీల ద్వారా లక్షల కోట్లు తరలించడానికి, రైతుల కడుపు కొట్టడానికి మీరు చేస్తున్న శంకుస్థాపన. కాబట్టే ప్రజలందరి తరపునా ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నాం’ అని జగన్  లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement