
హిల్లరీకి షాక్.. ట్రంప్ సంచలన విజయం
వాషింగ్టన్: సర్వేలన్నీ తారుమారు అయ్యాయి. అంచనాలు తప్పాయి. ఎగ్జిట్‌పోల్స్, మీడియా విజయం ఖాయమన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి చవిచూడగా.. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఊహించనివిధంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయకేతనం ఎగురవేశారు. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన.. గంట గంటకూ ఆధిక్యం చేతులు మారుతూ, నువ్వా నేనా అన్నట్టు హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్‌లో ట్రంప్ సంచలన విజయం సాధించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 538 ఓట్లున్న ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ స్పష్టమైన మెజార్టీ మార్క్ 270 అధిగమించారు. ట్రంప్ 276 ఓట్లు సాధించారు. హిల్లరీ 218 ఓట్లతో వెనుకబడ్డారు. పూర్తి ఫలితాలు కాసేపట్లో వెలువడుతాయి. ట్రంప్‌కు 5,67,97,101 ఓట్లు, హిల్లరీకి 5,57,41,659 ఓట్లు వచ్చాయి.
అమెరికాలోని మొత్తం 51 రాష్ట్రాల్లో ట్రంప్ 27, హిల్లరీ 18 రాష్ట్రాల్లో గెలుపొందారు. మరో 6 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడాల్సి వుంది. ట్రంప్ విజయం ఖాయమని తేలడంతో ఆయన అనుచరులు సంబరాలు చేసుకుంటుండగా, హిల్లరీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. పూర్తి ఫలితాలు వెలువడకుండానే హిల్లరీ నివాసం నుంచి ఆమె మద్దతుదారులు నిరాశతో వెనుదిరిగారు. ట్రంప్ శిబిరం సందడిగా మారింది. హిల్లరీ క్లింటన్ ఓటమిని అంగీకరిస్తూ ట్రంప్‌కు అభినందనలు తెలిపింది.
ఆద్యంతం హోరాహోరీ పోరు
- భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఎన్నికల కౌంటింగ్ మొదలైంది
- ప్రాథమిక ఫలితాల్లో ట్రంప్ ముందంజలో నిలవగా, కాసేపటి తర్వాత హిల్లరీ ఆధిక్యం కనబరిచారు
- ఆ వెంటనే ట్రంప్ దూసుకెళ్లారు. ఓ దశలో ట్రంప్ హిల్లరీ కంటే దాదాపు 58 ఓట్లు ఎక్కువ సాధించారు. ఎలెక్టోరల్ కాలేజీలో ట్రంప్ 167, హిల్లరీ 109 ఓట్లు కైవసం చేసుకున్నారు
- ట్రంప్ ఆధిక్యంలో ఉన్నాడని తెలియగానే భారత్ స్టాక్ మార్కెట్లు సహా ఆసియా, అమెరికా మార్కెట్లు భారీగా కుప్పకూలాయి
- కాగా కాలిఫోర్నియా ఎన్నికల ఫలితాలు వెలువడగానే హిల్లరీ.. ట్రంప్‌ను వెనక్కునెట్టి మళ్లీ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. హిల్లరీ 190, ట్రంప్ 186 ఓట్లు సాధించారు.
- కాసేపటి తర్వాత ట్రంప్ మళ్లీ ముందంజలోకి వచ్చారు. ఆ తర్వాత ట్రంప్ అదే జోరు కొనసాగించగా, హిల్లరీ మళ్లీ ముందంజ వేయలేకపోయారు
- కీలకమైన పెన్సిల్వేనియా రాష్ట్రంలో ట్రంప్ ఘనవిజయం సాధించడంతో దాదాపుగా అధ్యక్ష పీఠం ఖాయమైంది.
- అమెరికా 45వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన అతిపెద్ద వయస్కుడిగా చరిత్ర సృష్టించారు.