ఆందోళన అనవసరం చిదంబరం భరోసా
ఆందోళన అనవసరం చిదంబరం భరోసా
Published Fri, Aug 23 2013 1:28 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
న్యూఢిల్లీ: రూపాయి విలువ బలహీనపడినప్పటికీ ఆందోళన చెందనక్కర్లేదని ఆర్థిక మంత్రి పీ చిదంబరం అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న క్లిష్ట స్థితులను అధిగమించగలమని చెప్పారు. ఇన్వె స్టర్లు నిరాశపడొద్దన్నారు. వివిధ అంశాలపై ఇంకా ఆయన ఏమన్నారంటే...
కరెన్సీ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితి పట్ల మరీ ఆందోళన అక్కర్లేదు. కరెన్సీ ఒడిదుడుకుల వల్ల మన దేశమే కాదు. వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఈ తరహా ఇబ్బందులనే ఎదుర్కొంటున్నాయి. రూపాయి విషయానికి వస్తే ఉండాల్సిన స్థాయికన్నా విలువ తక్కువ ఉంది. తప్పనిసరిగా తగిన స్థాయికి బలోపేతం అవుతుంది. ఈ దిశలో సర్దుబాటు జరుగుతుంది. ఫారెక్స్ మార్కెట్లో ఒడిదుడుకులు, రూపాయిలో స్పెక్యులేషన్‌ను తగ్గించడానికి ఇటీవల తీసుకున్న చర్యలు- కరెన్సీలో స్థిరత్వం ఏర్పడిన తరువాత తిరిగి వెనక్కు తీసుకోవడం జరుగుతుంది.
పెట్టుబడులు, వృద్ధికి తగిన చర్యలు
దేశ ఆర్థికరంగ పునరుత్తేజానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. పెట్టుబడులు, దేశ స్థూల ఆర్థికాభివృద్ధి రేటు ఊపుపై దృష్టి సారిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్‌లో వృద్ధి రేటు కొంత నిరుత్సాహకరంగానే ఉండే అవకాశం ఉంది. అయితే అటు తర్వాత 2,3,4 త్రైమాసికాల్లో పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
క్యాపిటల్ కంట్రోల్స్ ఆలోచన లేదు...
కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ- దేశంలోకి వచ్చీ, పోయే విదేశీ మారక నిధుల విలువ మధ్య ఉన్న వ్యత్యాసం) కట్టడికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎటువంటి క్యాపిటల్ కంట్రోల్స్ నియంత్రణలనూ ప్రవేశపెట్టే యోచన లేదు. క్యాపిటల్ అకౌంట్ సరళీకరణ విధానాన్ని వెనక్కు మళ్లించే విధానం అటు ప్రభుత్వంవైపునకానీ, ఇటు ఆర్‌బీఐ వైపునకానీ లేదు.
ఫెడరల్ రిజర్వ్‌పై కామెంట్...
అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలు, వాటి పర్యవసానాలను ఎదుర్కొనడానికి భారత్ సంసిద్ధంగా ఉండాలి.
ద్రవ్యలోటు, క్యాడ్‌పై ఇలా...
ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు కట్టడికి ప్రభుత్వం తగిన చర్యలన్నింటినీ తీసుకుంటుంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 4.8 శాతానికి, క్యాడ్ 3.7 శాతానికి ( (70 బిలియన్ డాలర్లు) మించకుండా చూస్తాం.
అదుపులో రుణ పరిస్థితి: దేశ రుణ భారం తగిన స్థాయిలోనే ఉంది. 2006-07లో జీడీపీలో ఈ నిష్పత్తి 73.2 శాతం ఉంటే, 2012-13లో 66 శాతానికి తగ్గింది. ఆర్థిక వ్యవస్థ విదేశీ రుణ భారం జీడీపీలో 21.2 శాతం మాత్రమే. ఇక ప్రస్తుతం భారత్ విదేశీ మారక ద్రవ్య నిల్వల పరిమాణం ప్రస్తుతం 277 బిలియన్ డాలర్లుగా ఉంది.
మొండి బకాయిలు...
బ్యాంకింగ్‌లో మొండి బకాయిలు (ఎన్‌పీఏ)లు పెరుగుతున్న మాట వాస్తవమే. అయితే పలు ప్రాజెక్టులు ఇంకా ఆర్థికంగా సానుకూల ఫలితాలను అందించే స్థాయిలోనే ఉండడం ఇక్కడ సానుకూల ధోరణిలో చెప్పుకోవాల్సిన అంశం. నిలిచిపోయిన ప్రాజెక్టులను ప్రారంభించడానికి సైతం ప్రభుత్వం తగిన చర్యలను తీసుకుంటుంది. ఇక బ్యాంకుల క్యాపిటల్ అడక్వసీ రేషియో కూడా బాసెల్ ప్రమాణాలకన్నా మెరుగైన స్థితిలోనే ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.14,000 కోట్ల కొత్త పెట్టుబడులు సమకూర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
మైనింగ్ కీలకం
వృద్ధి మెరుగుకు బొగ్గు ఉత్పత్తి కీలకం. ఈ రంగంలో ఉత్పత్తి పెరగడానికి తగిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. బొగ్గు దిగుమతుల్లో అనిశ్చితి తొలగింపు, ఇనుప ఖనిజం మైనింగ్ పునఃప్రారంభం వంటి చర్యలపై కేంద్రం దృష్టి పెట్టింది. అలాగే ఎరువుల కర్మాగారం సామర్థ్యం పెంపునకు సైతం కృషి జరుగుతోంది. ముడి ఇనుము ఎగుమతులపై సుంకాలు విధించడానికి సంబంధించిన అంశం పరిశీలనలో ఉంది. ముడి ఇనుము మైనింగ్‌ను తిరిగి సుసంపన్నం చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
సావరిన్ బాండ్లపై
ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి సావరిన్ బాండ్ల జారీసహా అన్ని అవకాశాలనూ ప్రభుత్వం పరిశీలిస్తుంది. తగిన సమయంలో ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యను ప్రభుత్వం తీసుకుంటుంది.
Advertisement