ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు! | don't given to original certificates! | Sakshi
Sakshi News home page

ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు!

Published Wed, Jul 22 2015 12:31 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు! - Sakshi

ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు!

ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ వెల్లడి
‘ఇంజనీరింగ్’ విద్యార్థులకు సూచనలు
సీటు, కాలేజీ మార్చుకోవాలనుకుంటే రెండో దశ వరకు ఆగండి
కాలేజీల్లో ముందుగా ఫీజులు చెల్లించవద్దు
బ్యాంకు చలానా మాత్రమే చెల్లించాలి
అడ్మిషన్లలో కాలేజీలు ఇబ్బంది పెట్టకుండా చర్యలు

 
హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల్లో విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని.. మొదటి దశ ప్రవేశాల్లో సీటు వచ్చినా, రెండో దశ ప్రవేశాలు పూర్తయ్యే వరకు కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని, స్పెషల్ ఫీజుల వంటివి చెల్లించొద్దని ఇంజనీరింగ్ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ సూచించారు. రెండో దశ కౌన్సెలింగ్‌కు వెళతామంటే సర్టిఫికెట్లు, డబ్బు తిరిగి ఇవ్వడం లేదనే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పారు. తమకు కేటాయించిన సీటును విద్యార్థులు వెబ్‌సైట్లో ‘యాక్సెప్టెన్సీ’ బటన్ నొక్కి కన్‌ఫర్మ్ చేస్తే చాలని, అడ్మిషన్ నంబర్ కూడా వచ్చేస్తుందని తెలిపారు. దానిని కాలేజీ యాజమాన్యం నిరాకరించడానికి వీల్లేని విధంగా ఈసారి పకడ్బందీ చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఇదివరకు విద్యార్థి కాలేజీలో రిపోర్టు చేశాక కాలేజీ వారే ధ్రువీకరించే విధానం ఉండగా.. ఈసారి దానిని మార్చేశామన్నారు. ప్రవేశాల విషయంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను శ్రీనివాస్ వెల్లడించారు. ఫీజులు ఇస్తేనే అడ్మిషన్‌ను, సీటును కన్‌ఫర్మ్ చేస్తామంటూ కాలేజీలు చేసే వసూళ్లకు దీంతో అడ్డుకట్ట పడనుంది. ఆయన చేసిన సూచనలు..

 ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..

►మొదటి దశలో సీటు వచ్చిన విద్యార్థుల్లో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు అలాట్‌మెంట్ లెటర్‌ను (అందులో జీరో ఫీజు వస్తుంది) వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో ఆ పక్కనే స్టూడెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుంది. దానిని నొక్కితే చాలు విద్యార్థి అడ్మిషన్ కన్‌ఫర్మ్ అవుతుంది, అడ్మిషన్ నెంబర్ కూడా వస్తుంది.

►రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైనా.. కామన్ ఫీజు మినహా మిగతా ఫీజు చెల్లించాల్సిన వారు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పరిధిలోకి రాని వారు తమ సీటు అలాట్‌మెంట్ లెటర్‌తో పాటు చలానా ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. నిర్ణీత ఫీజును స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్రాంచీల్లో చెల్లించాలి. చలానా చెల్లించారంటే వారి సీటు కన్‌ఫర్మ్ అయినట్టే. వారు కూడా అడ్మిషన్ నంబర్ కావాలంటే వెబ్‌సైట్‌లో స్టూడెంట్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్‌ను నొక్కితే చాలు. వారు సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఓకే చేయలేకపోయినా.. ఆ సాకుతో వారి సీటును కాలేజీలు నిరాకరించ డానికి వీల్లేదు.

►కాలేజీ స్పెషల్ ఫీజుల వంటివాటిని ఆ కాలేజీలో, ఆ కోర్సులో చేరాలనుకుంటేనే ముందుగా చెల్లించాలి. లేదంటే రెండో దశ కౌన్సెలింగ్ అయ్యే వరకు చెల్లించవద్దు.

►ఇక రెండో దశ ప్రవేశాల కోసం ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అందరూ అర్హులే. గతంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోనివారికి 29న దానిని చేపట్టే అవకాశముంది.
 స    మొదటిదశలో సీటు వచ్చినవారు రెండో దశ వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మొదటి దశలో సీటు వచ్చినదాని కంటే మంచి కాలేజీలను ఎంచుకోవాలి. ఎందుకంటే రెండో దశలో సీటు కేటాయింపు జరిగితే.. మొదటి దశలో వచ్చిన సీటు దానంతట అదే రద్దయిపోతుంది. ఒకవేళ సీటు రాకపోతే మొదటి దశ సీటు ఉండిపోతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement