హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
- సినీ వ్యక్తులకు డ్రగ్ రాకెట్‌తో లింకుందన్న అధికారులు
- అరెస్టయిన ముగ్గురూ ప్రఖ్యాత ఎమ్మెన్సీల్లో ఉద్యోగులే
హైదరాబాద్: అత్యంత ఖరీదైన మాదకద్రవ్యాలను సరఫరా చేస్తోన్న ఓ ముఠా పట్టుబడింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరికి ఈ డ్రగ్ రాకెట్‌తో సంబధాలున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రఖ్యాత ఎమ్మెన్సీ కంపెనీల్లో పనిచేస్తూ, లక్షల్లో జీతాలు పొందుతోన్న ఉద్యోగులు, కొందరు విద్యార్థులకు కూడా ఈ వ్యవహారంలో భాగస్వాములైనట్లు తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్సుమెంట్, స్టేట్ టాస్క్‌ఫోర్స్‌లు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముఠా.. ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ అనే డ్రగ్‌ను సరఫరా చేస్తోందని, ఈ ద్రావకం ఒక్కో చుక్కా వేల రూపాయల ఖరీదు ఉంటుందని, మొత్తం 700 యూనిట్ల ఎల్‌ఎస్‌డీ, 34 గ్రాముల ఎండీఎంఏను సీజ్ చేశామని సబర్వాల్ చెప్పారు. సినీ పరిశ్రమకు చెందినవారికి ఈ ముఠాతో సంబంధాలున్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు.
ప్రస్తుతం అరెస్టయిన ముగ్గురూ ఉన్నత విద్యావంతులేనని, మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నవారేనని సబర్వాల్ వివరించారు. ఈ ముఠాకు సంబంధించి అబ్దుల్ బాహాద్, అబ్దుల్ కుదుస్‌లను ప్రధాన నిందితులుగా గుర్తించామని, సెల్‌ఫోన్‌లలోని డేటాను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, వివరాలు అందిన వెంటనే డ్రగ్స్ రాకెట్‌తో ఎంతమందికి సంబంధాలున్నాయి? డ్రగ్స్ ఎప్పుడెప్పుడు, ఎక్కడెక్కడ అమ్మారు? అనే దిశగా దర్యాప్తు చేస్తామని అకున్ సబర్వాల్ తెలిపారు. సినీ వ్యక్తులలో కొందరికి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నట్లు పోలీసులు ప్రకటించడం పరిశ్రమలో కలకలంరేపింది.