బాణసంచా వెలుగుల్లో దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనం
దుబాయ్: 2013కు వీడ్కోలు చెపుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. దుబాయ్‌లో ఏర్పాటు చేసిన బాణసంచా ప్రదర్శన ప్రపంచ రికార్డు నెలకొల్పింది. కొత్త ఏడాది కోసం ఆరు నిమిషాల వ్యవధిలో ఐదు లక్షల రకాలైన టపాసులను కాల్చినట్టు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రదర్శన కోసం పది నెలల నుంచి పక్కా ప్రణాళిక రూపొందించుకున్నారు. 94 కిలోమీటర్ల పరిధిలో బాణసంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు. దుబాయ్ కీర్తిని ఇనుమడింప చేసిన బుర్జ్ ఖలిఫా, బుర్జ్ ఆల్ అరబ్, పాల్మ్ జుమైరా, వరల్డ్ ఐలాండ్స్ మొదలైన వాటిని కలుపుతూ ఈ ప్రదర్శన సాగింది.
టపాసులతో కృత్రిమంగా సృష్టించిన సూర్యోదయం అందరినీ అబ్బురపరిచింది. 2012లో కువైట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా నమోదైన రికార్డును ఈ ప్రదర్శనతో దుబాయ్ తుడిచి పెట్టేసింది. అప్పుడు 77,282 రకాల టపాసులను ఉపయోగించగా.. ఈసారి 5 లక్షలకుపైగా టపాసులను కాల్చడం విశేషం. అమెరికాకు చెందిన బాణసంచా సంస్థ గ్రుస్సీ ఈ ప్రదర్శనకు టపాసులను అందించింది. సుమారు 200 మంది నిపుణులు, ఐదు వేల పని గంటల పాటు శ్రమించడం వల్లే ప్రపంచ రికార్డు సొంతమైందని దుబాయ్ అధికార వర్గాలు తెలిపాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్లోబల్ ప్రెసిడెంట్ అలిస్టర్ రిచర్డ్ స్వయంగా దుబాయ్ చేరుకుని బాణసంచా ప్రదర్శనను తిలకించడం విశేషం.