మొదట్లో డైనోసార్లు రెండు కాళ్లమీదే నడిచేవట!
టొరంటో: జురాసిక్ పార్క్.. సినిమా విడుదలైన తర్వాతే డైనోసార్ల గురించి చాలా మందికి తెలిసింది. అయితే సినిమాలో చూపించినట్లుగా డైనోసార్లు నాలుగు కాళ్లపై నడిచేవి కావట. ముందుగా వాటి పరిమాణం కూడా అంత పెద్దగా లేదట. మన కంగారూల సైజులో ఉండి.. అచ్చంగా వాటిలాగే తోకమీద నిలబడేవట. ఈ విషయాలన్నీ శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో రుజువయ్యాయి.
బైపెడలిజమ్.. అంటే రెండు కాళ్లమీద నడవడమనేది మొదటితరం డైనోసార్లకు చెందిన ప్రధాన లక్షణమని, పరిణామ క్రమంలో మరో రెండుకాళ్లు బలపడడంతో నాలుగు కాళ్లమీద సంచరించడం, శరీర పరిమాణం పెరగడం జరిగాయని కెనడాకు చెందిన ఆల్బెర్టా యూనివర్సిటీ శాస్త్రవేత్త స్కాట్ పర్సన్స్ తెలిపారు.
మొదట్లో రెండు కాళ్లపై కూడా నిలబడే కండర సామర్థ్యం డైనోసార్లకు ఉండేదని, దీంతో ముందు రెండు కాళ్లను ఆహార సేకరణకు ఉపయోగించేదని, ప్రస్తుతమున్న బల్లి జాతి జీవుల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయని పర్సన్స్ తెలిపారు. అంతేకాకుండా వీటి శరీర పరిమాణం కూడా చిన్నదిగా ఉండడంతో చాలా దూరం అలసట లేకుండా పరిగెత్తేవని చెప్పారు.