ముందస్తు హెచ్చరికలతో ప్రాణనష్టం తగ్గింది: జైపాల్రెడ్డి
న్యూఢిల్లీ: పై-లీన్ తుఫాన్పై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల వల్లనే పెద్ద ఎత్తున ప్రాణనష్టం తప్పిందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జైపాల్‌రెడ్డి చెప్పారు. తుఫాన్ బారిన పడకుండా 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం కురుస్తుందని ముందే చెప్పామని, కానీ శాఖల మధ్య సమన్వయం లోపించడంతో భారీ నష్టం సంభవించిందన్నారు.
శాస్త్ర పరిశోధనకు 11, 12వ ప్రణాళికల్లో అధిక నిధులు ఇచ్చామని తెలిపారు. వెదర్ రాడార్ కోసం రూ. 715 కోట్లు వెచ్చించామన్నారు. వెదర్ రాడార్‌తో రైతులకెంతో మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పై-లీన్ తుఫాన్ కారణంగా ఒడిశాలో 25 మంది మృతి చెందగా భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాపై పై-లీన్ ప్రభావం ఎక్కువగా పడింది.