గ్రీస్, టర్కీని కుదిపేసిన భారీ భూకంపం!
భారీ భూకంపం టర్కీ, గ్రీస్ దేశాలను కుదిపేసింది. రిక్టర్ స్కేల్‌పై 6.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంప కేంద్రాన్ని గ్రీక్ ద్వీపంలోని లెస్బోస్‌లో గుర్తించారు. భూకంపం ధాటికి తీరప్రాంత లెస్బోస్ పట్టణం అతలాకుతలంకాగా, పశ్చిమ టర్కీలోని ఏజియన్ తీరప్రాంతంలోని ఇజ్మీర్ ప్రాంతం కూడా బాగా దెబ్బతింది.
భూకంపం ప్రభావంతో ఇజ్మీర్ పట్టణంలో భవనాలు, కట్టడాలు నేలమట్టమయ్యాయి. రోడ్లు రెండుగా చీలిపోయాయి. భూకంప ప్రభావంతో ఓ మహిళ మృతిచెందగా... మరో 10మంది గాయపడ్డారు. భూకంపం కారణంగా అటు గ్రీస్‌లోని లెస్బోస్‌లోనే ఎక్కువ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భవనాలు కుప్పకూలడంతో రోడ్లన్నీ మూతపడ్డాయి. ఇక్కడ 500 మంది జనాభా కలిగిన వ్రిసా గ్రామం భూకంపం ధాటికి పూర్తిగా నేలమట్టమైంది. ఇక్కడ చాలా ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. ఇక్కడ ఓ మహిళ భూకంప శిథిలాల్లో చిక్కుకొని తీవ్రంగా గాయపడగా.. పలువురికి సాధారణ గాయాలు అయ్యాయని స్థానిక మేయర్ తెలిపారు.
భౌగోళికంగా నెలకొన్న ప్రదేశాల దృష్ట్యా గ్రీస్, టర్కీలో భూమి తరచూ కంపిస్తూ ఉంటుంది. అయితే ఈసారి తీవ్రత అధికంగా ఉందని స్థానికులు తెలిపారు. ఈ భూకంపం ధాటికి టర్కీ రాజధాని ఇస్తాంబుల్, గ్రీస్ నగరం ఎథెన్స్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. 2011లో టర్కీలోని వాన్ ప్రావిన్స్‌లో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 600 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టర్కీలో భయంకరమైన భూకంపం 1999లో వచ్చింది. అప్పట్లో 20వేల మంది చనిపోయారు.