
‘ఉపాధి’ ఉద్యోగుల ఆత్మహత్యాయత్నం
హన్మకొండ అర్బన్: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్‌తో సోమవారం వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో చేపట్టిన ఆందోళనలో పలువురు ఆత్మహత్యకు యత్నించారు. సమస్యల పరిష్కారం కోసం ఉపాధి హామీ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన సోమవారం 29వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్క్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన ఉద్యోగులు కలెక్టరేట్‌లోకి ప్రవేశించారు.
పెట్రోల్ బాటిళ్లతో కలెక్టరేట్ భవనం పెకైక్కి ఆందోళన చేశారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రంగంలోకి దిగిన సుబేదారి పోలీసులు ఉద్యోగులను కిందకు తీసుకువచ్చారు. ఆందోళనలో నాగేశ్, మేకల రవి, సుజన, సుప్పజ, సతీష్, సర్వేశ్వర్ పాల్గొన్నారు.