తెలంగాణ చరిత్రపై ఆంగ్ల రచనలు రావాలి
► తెలంగాణ ఎందుకొచ్చిందని ఇతర రాష్ట్రాల వాళ్లు అడుగుతున్నారు
► ఉద్యమ చరిత్ర ప్రపంచానికి తెలిసేలా మరిన్ని రచనలు రావాలి
► ఉద్యమడైరీ పుస్తకావిష్కరణలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి
► తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలన్న తపన బాగా పెరిగింది: కోదండరాం
సాక్షి, హైదరాబాద్ : ‘‘తెలంగాణ చరిత్ర తెలియక పోవడం వలన ప్రత్యేక రాష్ట్రం ఎందుకు వచ్చిందని ఇతర భాషల వారు అడుగుతున్నారు. భారత దేశ ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం చెప్పిన తెలంగాణ ఉద్యమ చరిత్ర రచనలను తెలుగు భాషతోనే సరిపెట్టకుండా ఆంగ్లభాషలోనూ తీసుకు రావాల్సిన అవసరముంది’’ అని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు.
ప్రముఖ రచయిత పిట్టల రవీందర్ రాసిన ‘తెలంగాణ రాష్ట్ర సాధన-ఉద్యమ డైరీ’ పుస్తకాన్ని శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. మొదటి అలజడి నుంచి ఆత్మహత్యల దాకా అన్ని అంశాలను గ్రంథస్థం చేసి ప్రజలకు తెలపాలని కోరారు. 1969 తర్వాత రెండు దశాబ్దాల విరామం వచ్చినప్పటికీ, ఉద్యమాన్ని చైతన్యపరిచే కార్యక్రమాలెన్నో పురుడు పోసుకున్నాయన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఉద్యమం.. విద్యావేత్తలను ఉద్యమకారులుగా, ఉద్యమ కారులను రచయితలుగా మార్చివేసిందన్నారు.ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా చరిత్ర సృష్టించిన తెలంగాణ ప్రజలు.. తమ చరిత్రను తామే రాసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి ప్రామాణికత లేదని ఓ వర్గం మీడియా ప్రచారం చేస్తోందన్నారు. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలను నిద్రపోకుండా చేసిన ఉద్యమ చరిత్ర కు పుస్తకరూపాన్ని ఇచ్చిన పిట్టల రవీందర్ కు అభినందనలు తెలిపారు.
ఉద్యమ చరిత్రపై తపన పెరిగింది
తెలంగాణ ఉద్యమం గురించిన అంశాలను టీఎస్‌పీఎస్‌సీ సిలబస్‌లో పెట్టడం వల్లో, మరెందువల్లో తెలీదు గాని సమాజంలో తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలుసుకోవాలన్న తపన పెరిగిందని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. ఎంతోమంది తెలంగాణ చరిత్ర పుస్తకాల కోసం ఎదురు చూస్తున్నారని, మరిన్ని పుస్తకాలు తీసుకు రావాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. 2010 నుంచి కేవలం నిరసనలకే పరిమితమైన ఉద్యమం, 2011 నుంచి మహోద్యమంగా రూపుదాల్చిందన్నారు.
ఫలితంగానే 2013 నుంచే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కోదండరాం చెప్పారు. వ్యూహాత్మక ఉద్యమ ప్రస్థానానికి ప్రాథమిక గ్రంథంగా పిట్టల రవీందర్ రాసిన పుస్తకం ఉపకరిస్తుందన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒక ప్రాజెక్ట్‌గా తీసుకు వచ్చేందుకు విద్యావేత్తలు కృషి చేయాలని, ప్రభుత్వం కూడా తోడ్పాటును అందించాలన్నారు. మిలియన్‌మార్చ్, సాగరహారం, సకలజనుల సమ్మె.. వంటి ఎన్నో ఘటనలను మరోమారు నెమరు వేసుకునేందుకు ఈ పుస్తకం దోహదపడుతుందన్నారు. విచిత్రమైన, విశిష్టమైన తెలంగాణ చరిత్రలో ఎన్నో పేజీలు ఖాళీగా ఉన్నాయని, రచయితలు, మేథావులు ఆ ఖాళీలను పూరించేందుకు ముందుకు రావాలని కోరారు.
భావితరాలు తెలుసుకునేలా..
భారతీయులకు చరిత్ర స్పృహలేదని పాశ్చాత్యులు చేస్తున్న విమర్శలు సరికాదని మన చరిత్రకారులు అంటున్నారని, అయితే.. తెలంగాణ చరిత్రను భావితరాలు తెలుసుకునేలా చేస్తున్న ప్రయత్నాలు తక్కువగానే ఉన్నాయని సీనియర్ పాత్రికేయుడు టంకశాల అశోక్ అన్నారు. క్రానికల్ రికార్డింగ్, కంపల్‌నేషన్ అండ్ డాక్యుమెంటేషన్, సంస్థలు, పార్టీల తరపున రచనలు, రాజకీయ, ఆర్థిక శాస్త్రవేత్తల విశ్లేషణ, వివిధ రంగాలకు చెందిన సామాన్య ప్రజల మనోభావాలు.. ఇలా పలు రకాలుగా తెలంగాణ ఉద్యమ చరిత్రను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్ర లేకుండా ఏదీ సమగ్రంగా ఉండబోదని, తెలంగాణ పునర్నిర్మాణంలో ఇది కూడా భాగమేనన్నారు.
పుస్తక రచయిత పిట్టల రవీందర్ మాట్లాడుతూ.. ఉద్యమ డైరీ పుస్తకం అంగ్ల అనువాదాన్ని త్వరలోనే తీసుకురానున్నట్లు ప్రకటించారు. పుస్తక ప్రచురణకు సహకరించిన ఉద్యమకారులకు, జర్నలిస్టులకు, హోంల్యాండ్ పబ్లికేషన్ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఎస్‌పీఎస్‌సీ సభ్యుడు విఠల్, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు బి.ప్రకాష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.