ఇపీఎఫ్ఓ మరో గుడ్ న్యూస్
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపీఎఫ్ఓ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వాడుకలో లేని పీఎఫ్ ఖాతాల నిధులకు సైతం వడ్డీ చెల్లించేందుకు యోచిస్తున్నామని ప్రకటించిన సంస్థ తాజాగా ఉద్యోగుల సంక్షేమం కోసం మరో కీలక అడుగు వేసింది. ఈమేరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఒక ప్రకటన చేశారు. దీని ప్రకారం పీఎఫ్ ఖాతాదారులు చనిపోయిన వారం రోజుల్లోపు వారి క్లెయిములను పూర్తి చేసేందుకు, అలాగే ఒక కార్మికుడు ఉద్యోగం నుంచి వైదొలగే ముందే పీఎఫ్ సమస్యల్ని పరిష్కరించేలా కార్మిక మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకోనుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో అక్టోబర్ 26 న జరిగిన సమీక్షా సమావేశంలో ఆదేశించిన ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఈమేరకు పూర్తి మార్గదర్శకాలను జారీ చేసినట్టు చెప్పారు. సత్వరమే చర్యలు తీసుకునేలా ఫీల్డ్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్స్ 64 వ వ్యవస్థాపక ఉత్సవాలను జరుపుకున్నట్టు మంత్రి తెలిపారు.
ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్న దత్తాత్రేయ సంస్థ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. అలాగే సంస్థ చేపట్టిన సంస్కరణలపై ప్రశంసలు కురిపించిన మంత్రి అక్టోబర్ 25, 2016 న కామన్ సేవా కేంద్రాల (సీఎస్ సీ) ఇ-గవర్నెన్స్ తో ఒప్పందం చేసుకున్నట్టు చెప్పారు. అలాగే ఈపీఎఫ్ చందాదారులకు కోసం ఒక గృహ పథకం ఏర్పాటుకు ఆలోచిస్తున్నట్టు చెప్పారు. పీఎఫ్ ఖాతాకు ఆధార్ ను అనుసంధానం చేసిన 50 లక్షలమంది పెన్షనర్లను జీవన్ ప్రమాణ పత్రాలతో గౌరవించనున్నట్టు దత్తాత్రేయ ప్రకటించారు.