
ఎర్రబెల్లి X రేవంత్
‘పీఏగా నేను ఉద్యోగం నుంచి తీసేసిన మనిషిని ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఉద్యోగంలో ఎట్ల పెడతవ్? అంతా నీ
♦ ఎర్రబెల్లి మాజీ పీఏ విషయంలో తీవ్ర వాగ్వాదం
♦ నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషణల పర్వం
♦ నీ వల్ల రాష్ట్రంలో పార్టీ పరువు పోయిందన్న ఎర్రబెల్లి
♦ నీ మాదిరి కోవర్టును కాదు.. రూమ్‌లో వేసి కొడతానన్న రేవంత్
సాక్షి, హైదరాబాద్ : ‘పీఏగా నేను ఉద్యోగం నుంచి తీసేసిన మనిషిని ఎన్‌టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఉద్యోగంలో ఎట్ల పెడతవ్? అంతా నీ ఇష్టమేనా? ఈ ఐటంలు చేసుడెందుకు?’
- ఎర్రబెల్లి
‘జైలు నుంచి విడుదలవుతున్నానని అభిమానంతో నా దగ్గరికొస్తే ఉద్యోగం నుంచి తీసేస్తవా? రెడ్డోడు టీడీఎల్పీల పనిచేయొద్దా? నేను జీతం ఇస్తూ టీడీపీ భవన్‌లో పనిచేయిస్తుంటే మధ్యల నీ పెత్తనం ఏంది?’
- రేవంత్‌రెడ్డి
టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మధ్య శనివారం చోటు చేసుకున్న వాగ్వివాదం ఇది! గతంలో ఎర్రబెల్లి ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తిని రేవంత్‌రెడ్డి.. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఉద్యోగంలో పెట్టుకోవడంపై మొదలైన గొడవ చినికిచినికి గాలివానగా మారింది. ఇరువురు నేతలు నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో దూషించుకోవడంతో పార్టీ నేతలు ఆశ్చర్యపోయారు. వరంగల్ ఉప ఎన్నికపై ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో శనివారం మధ్యాహ్నం పార్టీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ వర్గాల కథనం ప్రకారం.. ఈ భేటీకి వచ్చిన ఎర్రబెల్లికి టీడీఎల్పీలో తనకు ఇంతకుముందు పీఏగా పనిచేసిన వ్యక్తి కనిపించాడు.
రేవంత్‌రెడ్డి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన రోజు(జూలై 1)న ఎర్రబెల్లి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఆయన వద్ద పీఏగా ఉన్న వ్యక్తి ఎర్రబెల్లి విమానం ఎక్కగానే చంచల్‌గూడకు వెళ్లి రేవంత్ రెడ్డి విడుదల ర్యాలీలో పాల్గొన్నాడు. ఈ విషయం తెలిసిన ఎర్రబెల్లి ఆయ న్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రచారం జరిగింది. దీనిపై ఆ పీఏ రేవంత్‌ను కలిసి ఆవేదన వ్యక్తం చే శాడు. దీంతో ఆయన్ను రేవంత్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తనకు పీఏగా ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌లో ఉద్యోగం ఇప్పించి జీతం ఇస్తున్నారు. శనివారం పార్టీ మీటింగ్‌కు వచ్చిన ఎర్రబెల్లికి మాజీ పీఏ కనిపించడంతో రేవంత్‌ను నిలదీ శారు.
‘‘నా దగ్గర పనిచేసిన మనిషిని నువ్వు ఉద్యోగంలో పెట్టుకోవడం ఏంటి? నీ వల్ల తెలంగాణలో పార్టీకి ఇప్పటికే నష్టం జరిగింది. పరువు పోయిం ది. కొంచెం తగ్గితే మంచిది’’ అని ఆగ్రహంతో అన్నారు. ‘‘నా కోసం జైలుకు వచ్చినోన్ని ఉద్యోగం నుంచి తీసేస్తే.. నేనెందుకు ఊకుంట? అయినా నేను వేరే పార్టీ వాడినా? నేను చేసిందంత పార్టీ కోసమే. నీలెక్క కోవర్టును కాదు. నా జోలికొస్తే రూంలేసి కొడ్తా..’’ అంటూ ఎర్రబెల్లిపై రేవంత్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ‘‘సక్కగా మాట్లాడు. తమాషా చేస్తున్నవా? నా సంగతి నీకు తెల్వదు’’ అని ఎర్రబెల్లి అనగా.. ‘‘నీకు నీ వాళ్లు ఎంతో.. నాకు నా వాళ్లు అంతే.. నువ్వు నన్నేం చెయ్యలెవ్’’ అని రేవంత్ వాదనకు దిగారు. గొడవ చివరికి వ్యక్తిగత విమర్శలకు వెల్లడంతో పార్టీ సీనియర్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కల్పించుకొని.. ‘‘ఆయన(ఎర్రబెల్లి) పీకేసినోడిని నువ్వెందుకు పెట్టుకుంటావ్’’ అంటూ రేవంత్‌ను ప్రశ్నించారు. దూకు డు తగ్గించుకోమని సలహా ఇచ్చినట్లు సమాచారం.
వరంగల్‌లో పోటీపైనా విభేదాలు
పీఏ విషయంలో గొడవ అనంతరం వరంగల్‌లో పోటీపై నిర్వహించిన సమావేశంలోనూ రేవంత్, ఎర్రబెల్లి మధ్య వాగ్వాదం కొనసాగింది. 2014లో ఆ స్థానం నుంచి బీజేపీ పోటీ చేసినందున, ఇప్పుడు కూడా ‘మిత్రధర్మం’ ప్రకారం ఆ పార్టీకే ఛాన్స్ ఇవ్వాలని ఎర్రబెల్లి అనగా.. రేవంత్ అందుకు తీవ్ర అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. ఆ స్థానంలో బీజేపీ కంటే టీడీపీకే మొగ్గు ఉన్నట్లు తాజాగా నిర్వహించిన సర్వేలో తేలినట్టు పేర్కొన్నారు. రాత్రిపూట ఇతర పార్టీల నాయకులను కలిసేవారు ‘మిత్రధర్మం’ గురించి మాట్లాడుతున్నారంటూ ఎర్రబెల్లిని ఎద్దేవా చేశారు. అలాగే పార్టీ సమావేశాల గురించి తనకు సమాచారం ఇవ్వడం లేదని రమణను రేవంత్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి.. రేవంత్ సినిమాల్లో ఐటం సాంగ్ గర్ల్‌లాగా మీటింగ్‌లకు హాజరవుతారని, ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియదని వ్యాఖ్యానించారు. అందుకు రేవంత్... ఎర్రబెల్లిపై మండిపడడంతో పార్టీ నేతలు ఇద్దరికీ సర్దిచెప్పినట్టు సమాచారం.