హైదరాబాద్‌లో సీమాంధ్రుల నుంచి బలవంతపు వసూళ్లు: దిగ్విజయ్‌సింగ్
- దందాలను అరికట్టండి: దిగ్విజయ్
- సంఘ విద్రోహక శక్తుల పనే: తెలంగాణ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం అనంతరం హైదరాబాద్‌లోని సీమాంధ్రులపై కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని తమకు ఫిర్యాదులు అందాయని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో చెప్పారు. వారి నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతున్నారనే అంశంపై తమకు సమాచారం అందిందని ఆయన వారికి వివరించారు. సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేసేలా జరుగుతున్న ఈ అక్రమాల కట్టడికి మీరే పూనుకోవాలని సూచించారు. తామా బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం దిగ్విజయ్‌ను తెలంగాణ ప్రాంత కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్, ఎంపీలు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, అంజన్‌కుమార్ యాదవ్, నంది ఎల్లయ్య, ఎంఏ ఖాన్‌లు ఏఐసీసీ కార్యాలయంలో కలుసుకున్నారు. సుమారు 15 నిమిషాల పాటు ఆయనతో వివిధ అంశాలపై చర్చించారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు పార్లమెంట్ ఆవరణలో నిరసనలకు దిగడాన్ని వారీ సందర్భంగా దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
పార్టీ పరువు పోతోందని, పార్టీని ధిక్కరించేలా వ్యవహరిస్తున్న వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కొందరు ఎంపీలు కోరారు. తెలంగాణ ప్రక్రియ ఆగిందంటూ సీమాంధ్ర నేతలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని, వారిని కట్టడి చేయాలని కోరారు. ఈ సందర్భంగానే దిగ్విజయ్‌సింగ్ హైదరాబాద్‌లో సీమాంధ్రుల భద్రత అంశాన్ని ప్రస్తావించారు. వారి నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదు అందిందని తెలిపారు. ‘ఇది పక్కాగా సంఘ విద్రోహ శక్తుల పనే. వారిని కట్టడి చేసేందుకు మేం ప్రయత్నిస్తాం. మా ఫోన్ నంబర్లను ప్రకటించి.. బలవంతపు వసూళ్లు చేసే వారిపై ఫిర్యాదు చేయాలని కోరతాం. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క సీమాంధ్రుడి భద్రత బాధ్యత మాదే’ అని వారు హామీ ఇచ్చారు. సికింద్రాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో కొన్ని అసాంఘిక శక్తులు డబ్బులు వసూలు చేస్తున్నాయని, అలాంటివి జరగకుండా చూడాలని దిగ్విజయ్ తమకు సూచించారని సమావేశం అనంతరం ఎంపీ పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయినా తెలంగాణలోని సీమాంధ్రులతో అన్నదమ్ముల్లాగే మెలగుతామని కేంద్ర మంత్రి బలరాం నాయక్ చెప్పారు. సీమాంధ్రుల వ్యాపారాలు, పరిశ్రమలు, పాఠశాలలు, ఉద్యోగాలన్నింటికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొన్నారు.