
సర్జికల్ స్ట్రైక్స్‌పై కశ్మీరీ ప్రజలు ఏమన్నారు...
భారత సైన్యం అసలు సర్జికల్ స్ట్రైక్స్ చేయలేదని దుష్ప్రచారం చేస్తున్న పాక్ మీడియాతో పాటు.. స్వదేశంలోని కొందరు రాజకీయ నాయకులకు కశ్మీరీ ప్రజలు షాకింగ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబర్ 28వ తేదీ రాత్రి.. భారత ఆర్మీ బలగాలు చేసిన దాడిని ప్రత్యక్షంగా చూసిన కొంతమంది.. వాటికి సంబంధించిన గ్రాఫిక్స్‌ను విడుదల చేశారు. తాము కళ్లారా ఆ దాడులను చూశామని తెలిపారు. ఈ దాడులు చాలా కొద్దిసేపే జరిగినా.. అవి చాలా శక్తిమంతమైనవని తెలిపారు. ఈ ఆపరేషన్ ముగించుకునే వెళ్లేముందు జిహాదీల స్థావారాలన్నింటినీ భారత ఆర్మీ ధ్వంసం చేసిందని చెప్పారు.
సర్జికల్ స్ట్రయిక్స్లో మరణించిన ఉగ్రవాదులను రహస్యంగా సమాధి చేసేందుకు సెప్టెంబర్ 29 తెల్లవారుజామున వాటిని పాక్ వర్గాలు ట్రక్కులలో తీసుకెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఆపరేషన్లో భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకుని జరిపిన కొన్ని ప్రాంతాల వివరాలను కూడా వారు తెలిపారు. అల్-హవీ వంతెన గుండా సెప్టెంబర్ 28న 84ఎంఎం కార్ల్ గుస్తావ్ రైఫిల్స్ శబ్దాలు భారీగా వినిపించాయని స్థానిక ప్రజలు చెబుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి నౌగమ్ సెక్టార్లోని ఉగ్రవాద స్థావారాలను టార్గెట్గా చేసుకుని 25 పల్లెటూర్లలో ఈ ఆపరేషన్ను ఆర్మీ కొనసాగించిందని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు.
ఖైరతి బాగ్ అనే గ్రామంలో లష్కరే తాయిబాకు చెందిన మూడు చెక్క భవనాలను కూడా భారత ఆర్మీ ధ్వంసం చేసినట్టు పేర్కొన్నారు. ఆ ప్రాంతం లష్కర్ కంచుకోటగా ప్రాముఖ్యం పొందింది. కాల్పులు ప్రారంభమైన వెంటనే కొంతమంది లష్కర్ ఉగ్రవాదులు అడవుల్లోకి పారిపోయారని వివరించారు. ఈ దాడుల్లో సమారు 38-50 మంది ఉగ్రవాదులు చనిపోయి ఉంటారని, జిహాదీల వాహనాలు, కొన్ని భవనాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసం అయినట్టు పేర్కొన్నారు. తర్వాతి రోజు ఉదయం కూడా ఆరు మృతదేహాలను చల్హానా లష్కర్ క్యాంప్ వద్దకు తరలించినట్లు తెలుస్తోంది.
దాడుల అనంతరం లష్కర్ ఉగ్రవాదులు ఓ చోట సమావేశమై, పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులను తిప్పికొట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెప్పారు. భారత ఆర్మీకి ఈ దాడులపై త్వరలోనే సమాధానం ఇవ్వాలని వారు నిర్ణయించినట్టు మరో స్థానిక వ్యక్తి వివరించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద స్థావారాలపై భారత సైన్యం దాడులను పాక్ ఖండిస్తున్న నేపథ్యంలో ప్రత్యక్ష సాక్షులు ఈ వివరాలు వెల్లడించారు. ఇవి సర్జికల్ స్ట్రయిక్స్ కావని, సరిహద్దుల్లో తరచు జరిగే చిన్నపాటి ఎదురు కాల్పులేనని పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తోంది. దానిపై ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు నాయకులు కూడా సాక్ష్యాలను బయట పెట్టాలని కోరారు. మరోవైపు భారత ఆర్మీ సైతం ఆ దాడుల వీడియోలను బయటపెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.