ఫేస్ బుక్ సెల్ఫీ ఎంత పనిచేసింది!
మెల్ బోర్న్: గుర్రపు పందెంలో గెల్చుకున్న సొమ్మును 'ఫేస్ బుక్'లో పోగొట్టుకుంది ఓ ఆస్ట్రేలియా మహిళ. ఎఫ్ బీలో పోస్టు చేసిన సెల్ఫీయే ఆమె డబ్బు పోవడానికి కారణమైంది.
అదేలాగంటే...
చాంటెలె అనే మహిళ పెర్త్ అస్కట్ రేసుకోర్స్ లో మెల్న్ బోర్న్ కప్ పోటీలను వీక్షిస్తూ ప్రిన్స్ పెనజాన్స్ అనే గుర్రంపై 20 డాలర్లు పందెం కాసింది. రేసులో గెలవడంతో ఆమెకు 825 డాలర్లు వచ్చాయి. ఆనందంతో రేసు టికెట్ తో సెల్ఫీ దిగి ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. 'విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్' అంటూ సెల్ఫీకి క్యాప్షన్ కూడా పెట్టింది. 15 నిమిషాల తర్వాత పందెంలో గెలిచిన సొమ్ము కోసం నిర్వాహకులను సంప్రదించింది. అప్పటికే ఎవరో నగదు తీసుకెళ్లిపోయారని చెప్పడంతో చాంటెలె మొదట అవాక్కయింది. తర్వాత రియలైజ్ అయింది.
ఫేస్ బుక్ లో తాను పోస్ట్ చేసిన సెల్ఫీలోని టికెట్ పై ఉన్న బార్ కోడ్ ను కత్తిరించి సొమ్ముకు తీసుకున్నారని తెలుసుకుంది. తన ఫేస్ బుక్ ఫ్రెండ్స్ ఎవరో ఈ పని చేసివుంటారని చాంటెలె పేర్కొంది. 'నా ఫోటోతో రేసులో గెలిచిన మొత్తాన్ని తెలివిగా కాజేశారు. నా ఫేస్ బుక్ లోని స్నేహితులే ఈ పని చేశారని నాకు తెలుసు. ప్రైజ్ మనీతో ఈ రోజు ఎంతో ఆనందంగా గడుపుదామనుకున్న నా ఆశపై నీళ్లు చల్లారు' అని చాంటెల్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసింది.