ట్విన్ టవర్స్ కూల్చివేత ఉగ్రదాడి కాదట!
సామాజిక మీడియా దిగ్గజం ఫేస్ బుక్ మరోసారి తప్పులో కాలేసింది. తన ట్రెండింగ్ టాపిక్స్ లో బూటక కథనాన్ని ప్రకటించడం సంచనలం రేపింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ విధ్వంసం ఉగ్రదాడి కాదంటూ డైలీ స్టార్ లింక్ ఫేస్ బుక్ లో హల్ చల్ చేసింది. దీనిపై స్పందించిన టెక్ మీడియా అది తప్పుడు కథనమని తెలిపింది. తక్షణ పరిష్కారంగా ఈ కథనాన్ని తొలగించినట్టుగా ఫేస్ బుక్ ప్రతినిధి శుక్రవారం ప్రకటించారని టెక్ వెబ్ సైట్ సీఎన్ఈటీ ప్రకటించింది. 9/11 ఉగ్రదాడికి 15 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా సాధారణంగా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ పై ప్రజలకు ఆసక్తి ఉంటుందని మీడియా నివేదించింది. ఈ కారణంగానే ఇది టాప్ లిస్ట్ లో నిలిచిందని తెలిపింది. అయితే గత రెండు వారాల్లో ఇలాంటి తప్పుడు కథనాలు దర్శనమివ్వడం ఇది రెండవసారి కావడం గమనార్హం.
ట్విన్ టవర్స్ ఉగ్రదాడి ఘటన టెర్రరిస్టుల పనికాదనీ, భవనంలో అమర్చిన బాంబుల వల్లే టవర్స్ కూలిపోయాయంటూ ఫేస్ బుక్ ట్రెండింగ్ టాపిక్స్ లో ఓ కథనం టాప్ లో నిలిచింది. దీంతో వివాదం చెలరేగింది. అయితే అల్గారిథమ్స్ తప్పుడు లింక్ లను సంస్థ క్వాలిటీ కంట్రోల్ టీం కనిపెట్టకపోవడంపై వ్యాఖ్యానించడానికి ఫేస్ బుక్ నిరాకరించింది.
కాగా ఫేస్ బుక్ ప్రస్తుతం సుమారు 1.7 బిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. ట్రెండింగ్స్ టాపిక్స్ లోని కథనాలు వాస్తవమా కాదా అనే దానికి సంబంధం లేకుండా పాపులర్ మారి, ఎక్కువ వ్యూస్ ను సాధించడం తెలిసిందే.