విరాట్ కోహ్లిపై ఫ్యాన్స్ ఆగ్రహం!
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం ప్రకటించిన భారత క్రికెట్ జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దగా మార్పులేవీ చేయకుండా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఆటగాళ్లను యథాతథంగా కొనసాగిస్తూ జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ, బౌలర్ షార్దుల్ ఠాకూర్‌పై మాత్రం వేటు వేసింది.
అయితే, ఈ మధ్యకాలంలో వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లను జట్టులో కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు గౌతం గంభీర్‌ను పక్కనబెట్టి మరీ ఈ ఇద్దరిని జట్టులోకి తీసుకోవడం మాజీ క్రికెటర్లను విస్మయ పరిచింది. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో మంచి ఫామ్‌ను ప్రదర్శిస్తున్న గంభీర్‌కు అవకాశం కల్పించకపోవడం సహజంగానే టీమిండియా అభిమానుల్ని నిరాశ పరిచింది.
తనకు ఇష్టులైన రోహిత్, ధావన్‌లకు చాన్స్ ఇచ్చేందుకే విరాట్ కోహ్లి సీనియర్ ఆటగాళ్లను పట్టించుకోవడం లేదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గొప్ప ఆటగాడైన కోహ్లి వ్యక్తిగత ఈర్ష్యద్వేషాలను పక్కనబెట్టాలని, సొంతగడ్డపై జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా రాణించాలంటే ధావన్ కన్నా గంభీర్‌ను తీసుకోవడం మంచిదని పలువురు సూచించారు. మరోవైపు తాజాగా ప్రకటించిన జట్టులో తనకు చోటు కల్పించకపోవడంపై గౌతం గంభీర్ కూడా బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకొని కార్నర్ చేసినా.. తాను పిరికివాడిని కాదని, పోరాడుతానని గంభీర్ స్పష్టం చేశాడు. జట్టులో చోటు లభించనంతమాత్రాన తాను ఓడిపోయినట్టు కాదని చెప్పుకొచ్చారు. దీంతో గంభీర్ మద్దతుగా అభిమానులు కోహ్లిపై మండిపడుతూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తున్నారు.
@GautamGambhir i am disappointed with @imVkohli for not selecting u
— Avi Chopra (@AviMSD07) September 13, 2016