బీ-కేటగిరీపై తొలగని భయాలు
Published Fri, Aug 9 2013 3:13 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో యాజమాన్య కోటా(బీ-కేటగిరీ) సీట్ల భర్తీకి మధ్యం తర ఉత్తర్వుల ద్వారా హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ.. అభ్యర్థులకు పూర్తిస్థాయిలో భరోసా దక్కలేదు. దరఖాస్తు ఫారాలు ప్రతి అభ్యర్థికీ అందేందు కు తీసుకోవాల్సిన చర్యల విషయంలో అటు యాజ మాన్యాలకు, ఇటు ఉన్నత విద్యాశాఖకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ విద్యార్థుల నుంచి యాజమాన్యాలు దరఖాస్తులు స్వీకరిస్తాయా? మెరి ట్ ప్రకారం జాబితాలు రూపొందిస్తాయా? అన్నది అనుమానమే. ఆన్‌లైన్‌లోనూ స్వీకరించాలని హైకోర్టు ఆదేశాల్లో ఉన్నా కళాశాలల వద్ద ఆ వెసులుబాటే లేదు. కొన్ని కళాశాలలకు వెబ్‌సైట్ కూడా లేదు. ప్రతిభా క్రమంలో భర్తీచేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. ఇందుకు తగిన మార్గదర్శకాలు, విద్యార్థి ప్రయోజనాల పరిరక్షణకు అవసరమైన మార్గాలు ఉన్నత విద్యాశాఖ వద్ద లేవని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. బీ-కేటగిరీ సీట్ల భర్తీలో మళ్లీ గత అక్రమాలే పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అవరోధాలెన్నో: గతంలో బీ కేటగిరీ సీట్లకు అసలు దరఖాస్తే దొరికే పరిస్థితి లేదు. హైకోర్టు తాజా తీర్పు ప్రకారం ఇప్పుడు దరఖాస్తులు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి చేసిన ఈ దరఖాస్తులను విద్యార్థులు ఆన్‌లైన్‌లోగానీ, రిజిస్టర్డ్ పోస్టు ద్వారాగానీ కళాశాలకు పంపించాలని సూచించింది. అయితే కళాశాలలు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉం చినా.. వాటిని ఆన్‌లైన్‌లోనే స్వీకరించే వ్యవస్థ లేదు. ఆన్‌లైన్‌లో స్వీకరించే ఏర్పాటు చేసుకున్నా.. వాటిని స్వీకరించినట్టు రుజువు ఇచ్చేలా వ్యవస్థ లేదు. దీనిపై ఉన్నత విద్యాశాఖ అధికారులూ స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఉన్నత విద్యామండలి స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తే తప్ప విద్యార్థుల భయాలు తొలగే పరిస్థితి కనిపించట్లేదు. కన్వీనర్ కోటాకు, బీ-కేటగిరీ సీట్లకు ఒకే ఫీజు ఉండడం, గతంలో కంటే ఇప్పుడు 300 శాతం వరకు ఫీజులు పెరగడంతో గతేడాది డొనేషన్లేవీ లేకుండానే చాలా కళాశాలలు పారదర్శకంగానే సీట్లు భర్తీ చేశాయి. కానీ 50 కళాశాలలు అక్రమాలకు పాల్పడగా.. వాటికి ఉన్నత విద్యామండలి సంజాయిషీ నోటీసులిచ్చి చేతులు దులుపుకొంది. అక్రమాలకు పాల్పడే కాలేజీల జాబితా మండలి వద్ద ఉన్నందున వాటి భర్తీ ప్రక్రియపై డేగకన్నేస్తే అవకతవకల్ని అరికట్టే వీలుంది.
జీవో 74 ప్రకారమే: జీవో 66పై తీర్పు రిజర్వులో ఉన్నందున పాత జీవో 74 ప్రకారమే యాజమాన్య కోటా సీట్లు భర్తీకానున్నాయి. ఆ జీవో ప్రకారం తొలి ప్రాధాన్యం బయటి రాష్ట్రాల ఏఐఈఈఈ (ప్రస్తుతం జేఈఈ-మెయిన్‌గా వ్యవహరిస్తున్నారు) ర్యాంకర్లకు, ఎంసెట్ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం, ఇంటర్ మార్కులతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మూడో ప్రాధాన్యమిస్తారు.
Advertisement
Advertisement