
ఫెడ్ జోష్‌తో లాభాలు
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మరింతగా ఆలస్యమవుతుందన్న ....
230 పాయింట్ల లాభంతో 27,010కు సెన్సెక్స్
నిఫ్టీకి 72 పాయింట్ల లాభం
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు మరింతగా ఆలస్యమవుతుందన్న అంచనాలతో ప్రపంచమార్కెట్లతో పాటు మన స్టాక్ మార్కెట్ కూడా గురువారం లాభాల్లో ముగిసింది. దీంతో మూడు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 230 పాయింట్ల లాభంతో 27,010 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 72 పాయింట్ల లాభంతో 8,179 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. వాహన, రిఫైనరీ, లోహ, క్యాపిటల్ గూడ్స్, విద్యుత్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. రిటైల్ విక్రయాలు సెప్టెంబర్‌లో 0.1 శాతమే పెరిగాయని అమెరికా వాణిజ్య విభాగం వెల్లడించింది. దీంతో ఫెడ్ వడ్డీరేట్ల పెంపు మరింత ఆలశ్యమవుతుందన్న అంచనాలతో ఆసియా, యూరోప్ మార్కెట్లు ర్యాలీ జరిపాయి. సెన్సెక్స్ 26,842 పాయింట్ల వద్ద లాభాలతో మొదలైంది. కొనుగోళ్ల కారణంగా 27,036 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 230 పాయింట్ల లాభంతో 27,010 పాయింట్ల వద్ద ముగిసింది.
లాభాల్లో వాహన షేర్లు
సెప్టెంబర్‌లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ అమ్మకాలు 55 శాతం పెరగడం, అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మాక్వెరీ రూ.640 టార్గెట్ ధరగా ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చని రికమెండ్ చేయడంతో టాటా మోటార్స్ దూసుకుపోయింది. 8 శాతం వృద్ధితో రూ. 381 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. పండుగల సీజన్‌లో అమ్మకాలు పుంజుకుంటాయనే అంచనాలతో వాహన షేర్లు లాభపడ్డాయి.