లాభాల స్వీకరణ..119 పాయింట్లు డౌన్
♦ అమెరికా ఫెడ్ మీటింగ్‌పై ముందు జాగ్రత్త
♦ 28,000 స్థాయి దిగువకు సెన్సెక్స్
♦ 8,600 స్థాయి కిందకు నిఫ్టీ
ముంబై : అమెరికా, జపాన్ కేంద్ర బ్యాంకుల నుంచి కీలక నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో లాభాల స్వీకరణతో మంగళవారం స్టాక్ సూచీలు తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలో 28,121 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ పెరిగిన సెన్సెక్స్ తదుపరి 28,000 పాయింట్ల దిగువకు జారిపోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 119 పాయింట్ల క్షీణతతో 27,977 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్ల తగ్గుదలతో 8,591 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం మంగళ , బుధవారాల్లో జరుగుతోంది. వడ్డీ రేట్లపై ఫెడ్ తీసుకునే నిర్ణయం పట్ల ప్రపంచ మార్కెట్లో జాగురూకత నెలకొన్నదని, ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా లాభాల స్వీకరణ జరిగినట్లు జియోజిత్ బీఎన్‌ఫీ పారిబాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. అలాగే బ్యాంక్ ఆఫ్ జపాన్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనుంది.
ఫలితాల ప్రభావం...
తాజాగా క్యూ1 ఫలితాలు ప్రకటించిన మారుతి సుజుకి, డాక్టర్ రెడ్డీస్ షేర్లు క్షీణించాయి. మారుతి నికరలాభం 23 శాతం పెరిగినా, ఈ షేరు 1.44 శాతం తగ్గుదలతో రూ. 4,485 వద్ద ముగిసింది. నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ షేరు 4.37 శాతం క్షీణించి రూ.3,323 వద్ద క్లోజయ్యింది. ఇప్పటివరకూ వెల్లడైన కార్పొరేట్ ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడం, జీఎస్‌టీ బిల్లు ఆమోదానికి అడ్డంకులు ఏర్పడే అవకాశాలుండటంతో మార్కెట్ గరిష్టస్థాయిలో స్థిరపడలేకపోయిందని ఆనంద్ జేమ్స్ వివరించారు.