ఫ్రెషర్స్ పార్టీ: రోడ్డెక్కి తన్నుకున్న విద్యార్థులు
హైదరాబాద్: సరదాగా జరుపుకోవాల్సిన వేడుకలో వాగ్వాదం మొదలైంది. అదికాస్తా కొట్లగామారి కొట్టుకునేస్థాయికి వెళ్లింది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు రోడ్డుపైకెక్కి తన్నుకున్నారు. హైదరాబాద్ లో విస్మయం కలిగించిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..
కొత్తపేటలోని అవంతి పీజీ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు అదే ప్రాంతంలోని వైట్ హౌస్ ఫంక్షన్ హాలులో బుధవారం ఫ్రెషర్స్ డే వేడుక జరుపుకొన్నారు. పార్టీకి హాజరైన విద్యార్థులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఏకంగా కొత్తపేట రోడ్డుపైకి వచ్చి వీరంగం సృష్టించారు. విద్యార్థుల కొట్లాట చూసి అక్కడున్నవారు విస్తుపోయారు.
అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను సైతం ఖాతరుచేయకుండా విద్యార్థులు గొడవను కొనసాగించారు. విద్యార్థులు మద్యం సేవించి గొడవపడినట్లు సమాచారం. పోలీసులు రంగప్రవేశం చేసిన చాలాసేపటికిగానీ వివాదం సర్దుమణగలేదు. అయితే గొడవ ఎందుకు, ఎలా జరిగిందనే విషయం తెలియాల్సిఉంది. అవంతి కాలేజీ యాజమాన్యం స్పందన కూడా తెలియాల్సి ఉంది.