
ఫైనాన్షియల్ బేసిక్స్..
ప్రస్తుతం మంచి ఫైనాన్షియల్ ప్లానర్‌ను ఎంచుకోవడమనేది చాలా కష్టమైన విషయమే. అనువైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడానికి ముందు చాలా విషయాలు చూడాలి.
సరైన ఫైనాన్షియల్ ప్లానర్ ఎంపిక ఎలా?
ప్రస్తుతం మంచి ఫైనాన్షియల్ ప్లానర్‌ను ఎంచుకోవడమనేది చాలా కష్టమైన విషయమే. అనువైన వ్యక్తిని ఎంపిక చేసుకోవడానికి ముందు చాలా విషయాలు చూడాలి. ఇందులో భాగంగానే మన అవసరాలను, ఆర్థిక లక్ష్యాలను గుర్తించాలి. ఉదాహరణకు మీకు ఒక ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని భావిస్తున్నప్పుడు.. ముందుగా ఇన్సూరెన్స్ లెసైన్స్ కలిగిన, వాటి గురించి సలహాలను అందించే ప్లానర్‌ను సంప్రదించాలి.
వివరాల సేకరణ ప్రధానం. ఫైనాన్షియల్ ప్లానర్ అర్హతలు, ఇతర విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ ఫైనాన్షియల్ ప్లానర్ మనకు అవసరమైన సేవలను అందించగలరా? లేదా? అనేది అర్థమౌతుంది. అలాగే తన అనుభవాన్ని కూడా పరిగనలోకి తీసుకోండి.
కొందరు ఫైనాన్షియల్ ప్లానర్స్ వారి క్లయింట్స్‌కు ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. మరి కొందరైతే తమ టీమ్ ద్వారా సేవలందిస్తుంటారు. అందుకే మీరు ఫైనాన్షియల్ ప్లానర్‌ను కలిసి ఈ వివరాలన్నీ అడగండి. ఫైనాన్షియల్ ప్లానర్ తన టీమ్‌తో కలిసి పనిచేస్తారా? మీ ఖాతాను ఎవరు నిర్వహిస్తారు? వంటి అంశాలను తెలుసుకోండి.
కొందరు ప్లానర్స్ కొన్ని అంశాలకు సంబంధించి రిజిస్టర్ చేసుకుంటారు. అంటే వారు కొన్ని విషయాల్లోనే నిష్ణాతులై ఉంటారు. ఉదాహరణకు కొందరు మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి మాత్రమే సలహాలిస్తుంటారు. కాబట్టి మీ ప్లానర్ దేన్లో నిష్ణాతులన్నది తెలుసుకున్నాకే ఒక నిర్ణయానికి రండి.
ఫైనాన్షియల్ ప్లానర్‌కు ఎక్కువ ఖర్చవుతుందని భావిస్తే.. మీకు కావలసిన సేవలకు వారు ఎంత చార్జ్ చేస్తున్నారో ముందు తెలుసుకోండి. ప్లానర్స్ కమీషన్‌తో పాటు పలు ఫీజుల్ని కూడా వసూలు చేస్తారు. వీటిని ముందే తెలుసుకోండి. అలాగే ప్లానర్ ఎక్కడి నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారో గమనించండి. ప్లానర్ ఎంపికలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ది కూడా కీలకపాత్రే.