ఫైనాన్షియల్ బేసిక్స్..
రియల్టీలో పెట్టుబడులు ఉత్తమమేనా?
భారతీయులకు రియల్ ఎస్టేట్ రంగంపై మక్కువ ఎక్కువ. రియల్టీతో మనకు విడదీయలేని అనుబంధముంది. ఇల్లు, ఆఫీస్, స్థలం ఇలా.. వీటిన్నింటితో ఎప్పుడు మనం మమేకమై ఉంటాం. ఇక ఇన్వెస్టర్లు కూడా వారి పోర్ట్‌ఫోలియోలో రియల్ ఎస్టేట్‌కు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తారు. అంతెందుకు సామాన్యులు కూడా రియల్టీలో పెట్టుబడులు సురక్షితమైనవని భావిస్తారు. స్థలం ధర రోజు రోజుకి పెరగడం తప్ప తగ్గడముండదని అనుకుంటారు. కానీ మనం అప్పుడప్పుడు ప్రాపర్టీ ధరలు తగ్గాయని, డిమాండ్ పడిపోయిందనే వార్తలూ చదువుతుంటాం. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలి.
లిక్విడిటీతో చిక్కు..
రియల్టీ పెట్టుబడుల్లో సమస్యలు కూడా దాగున్నాయి. ఉదాహరణకు మీరు బ్యాంకుల్లో/ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో రుణం తీసుకొని రియల్టీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు వడ్డీరేట్లు పెరిగితే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది. మరొక ముఖ్యమైన అంశం లిక్విడిటీ. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే.. లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) సమస్య ఉత్పన్నం కాదు. అంటే డబ్బులు అవసరమైనప్పుడు స్టాక్స్‌ను వెంటనే విక్రయిం చొచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటకు రావొచ్చు. కానీ రియల్టీలో ఇలాంటి పరిస్థితి ఉండదు. లిక్విడిటీ సమస్య ఎదురవుతుంది.
స్వల్పకాలికమైతే వద్దు..
గతంలో రియల్టీ రంగం మంచి బూమ్‌లో ఉండేది. ఆ సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు వారి పెట్టుబడులకు రెట్టింపు రాబడిని పొందారు. కానీ తర్వాత పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతమైతే డీమోనిటైజేషన్ దెబ్బలో రియల్టీ కష్టాలు మరింత పెరిగాయి. అయితే ఈ పరిస్థితులు కూడా ఎప్పుడూ ఒకేలా ఉండవు. స్వల్పకాలంలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వారు రియల్టీకి దూరంగా ఉండటం ఉత్తమం. దీర్ఘకాలంలో రియల్టీ పెట్టుబడులు మంచి రాబడినే అందిస్తాయి.