టాప్ కమెడియన్ పై కేసు నమోదు!
ముంబై: దేశంలోనే అత్యధికంగా ఆదాయం ఆర్జించే టాప్ కమెడియన్ కపిల్ శర్మ. గత ఐదేళ్లలో రూ. 5 కోట్ల ఆదాయ పన్నుచెల్లించిన తనను ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు రూ. 5 లక్షలు లంచం అడిగారంటూ ఆయన ట్విట్టర్ లో పెద్ద దుమారమే రేపారు. ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వస్తే 'మంచి రోజులు' వస్తాయన్నారు.. అవి ఇవేనా అంటూ ఆయన ఆగ్రహంగా ప్రశ్నించారు.
ఈ వివాదం సద్దుమణగకముందే కపిల్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఆయనపై ముంబైలోని వెర్సోవా పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. వెర్సోవా పరిసరాల్లోని తన బంగ్లా వెనుకభాగంలో ఉన్న రావిచెట్ల వద్ద శిథిలాలు పారవేయడం ద్వారా పర్యావరణానికి ఆయన హాని కలిగించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. శిథిలాలు పారవేయడం ద్వారా కపిల్ శర్మ చట్టాలను ఉల్లంఘించారా? అన్నది గుర్తించడానికి సర్వే నిర్వహించాల్సిందిగా ఇప్పటికే ముంబై సబర్బన్ జిల్లా కలెక్టర్ దీపేంద్రసింగ్ కుశ్వాహా ఆదేశాలు ఇచ్చారు.
ఈ నేపథ్యంలో సర్వే నిర్వహించిన అధికారులు.. కపిల్ శర్మ అక్రమ నిర్మాణాలు, పర్యావరణ చట్టం ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. పశ్చిమ అంధేరిలోని ఫోర్ బంగ్లాస్ ఏరియాలో ఉన్న ఈ భవనాన్ని గత ఏడాది నవంబర్ లో కపిల్ శర్మ కొనుగోలు చేశాడు. అయితే, ఆ తర్వాత ఈ భవనానికి పలు మార్పులు, అక్రమ నిర్మాణాలు చేపట్టడం ద్వారా పర్యావరణ చట్టాలను ఆయన తుంగలో తొక్కారని మున్సిపాలిటీ అధికారులు ఆరోపిస్తున్నారు. తన భవనాలకు అనుమతుల విషయంలో ముంబై అధికారులు లంచం అడిగినట్టు ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే.