తగలబడుతున్న చెన్నై!
- పోలీసు వాహనాలకు నిప్పు
- భగ్గుమన్న ఆందోళనకారులు
- తమిళనాట అంతటా అదుపు తప్పుతున్న నిరసనలు
- ఉధృతమవుతున్న జల్లికట్టు ఉద్యమం
చెన్నై: తమిళనాట జల్లికట్టు ఉద్యమం ఉధృతరూపు దాలుస్తోంది. హింసాత్మకంగా మారుతోంది. మెరీనా బీచ్‌లోని ఆందోళన చేస్తున్న యువతను బలవంతంగా తరలించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితులు చేయి దాటాయి. తమిళనాడు అంతటా నిరసనలు అదుపు తప్పుతున్నాయి. ఎక్కడికక్కడ ఆందోళనకారులు పోలీసులపై తిరగబడుతున్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరోవైపు జల్లికట్టు ఉద్యమానికి ముఖ్య కేంద్రమైన మెరీనా బీచ్‌లోనూ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోపోద్రిక్తులైన ఆందోళనకారులు మెరీనా బీచ్ సమీపంలో ఉన్న ఐస్‌హౌస్ పోలీసు స్టేషన్‌కు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. పోలీసు స్టేషన్ ఎదుట ఉన్న వాహనాలను తగలబెట్టారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తగలబడుతున్న పోలీసు వాహనాలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. దీంతో ఇక్కడ తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది.