మాట్లాడుతూ భోరుమన్న లారెన్స్!
చెన్నై: జల్లికట్టుకు మద్దతుగా మెరీనా బీచ్‌లో ఉద్యమిస్తున్న యువతను పోలీసులు బలవంతంగా తరలిస్తుండటంపై ప్రముఖ సినీ నటుడు లారెన్స్ ఆవేదనతో స్పందించారు. మెరీనా బీచ్‌లోని యువతతో చర్చలు జరుపాలని తాము నిన్నరాత్రే నిర్ణయించామని ఆయన తెలిపారు. ఇంతలోనే పోలీసులు మెరీనా బీచ్‌పై విరుచుకుపడి.. యువతను బలవంతంగా తరలిస్తుండటంతో అక్కడ భయాందోళన రేకెత్తించే వాతావరణం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
మెరీనా బీచ్ నుంచి ఓ మహిళ తనకు ఫోన్ చేసి.. టీవీ చూడమని చెప్పిందని, టీవీ పెట్టి చూస్తే.. పోలీసుల వల్ల మెరీనా బీచ్‌లో ఉన్న యువత భయాందోళనకరంగా కనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే మెరీనా బీచ్ వెళ్లేందుకు ప్రయత్నించానని, తాను ఎంత వేడుకున్నా పోలీసులు అనుమతించలేదని తెలిపారు. గంటలోపు ఎట్టిపరిస్థితుల్లో, ఎలాగైనా మెరీనా బీచ్‌కు చేరుకునేందుకు తాను ప్రయత్నిస్తానని, అంతలోపు యువత ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని, భయాందోళనకు గురికావొద్దని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. పోలీసుల చర్యకు వ్యతిరేకంగా సముద్రంలోకి దిగి యువత ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తుంటే.. గుండె తరుక్కుపోతున్నదని ఆయన కంటతడి పెడుతూ చెప్పారు. ఏది ఏమైనా మీ ప్రాణాలు అన్నింటికంటే ముఖ్యమైనవని, యువత ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని లారెన్స్ విజ్ఞప్తి చేశారు.