చైనీస్ ఘటోత్కచుడి హల్చల్
బీజింగ్: వేల మంది అతిథుల కోసం వండిన వంటలన్నింటినీ 'వివాహ భోజనంబు..' పాట పాడుతూ ఘటోత్కచుడు ఒక్కడే ఆరగించే సీన్ 'మాయాబజార్' సినిమాలో హైలెట్ అయింది. అచ్చం మన ఘటోత్కచుడిలానే.. చైనాకు చెందిన ఓ వ్యక్తి పే..ద్ద గిన్నెడు నూడుల్స్ లాగించేసి సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయాడు!
చైనీస్ అగ్నిమాపక శాఖ ఉద్యోగి అయిన బూ వెన్ మింగ్ భారీ గిన్నెడు నూడుల్స్ తింటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. దాదాపు ఐదారుగురు తినే నూడుల్స్ ను ఒక్కడే తింటున్న తీరును అతని స్నేహితులు ఫొటోలు తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. 'ఓరి నీ ఆత్రం పాడుగానూ.. ఎలా తిన్నవయ్యా అన్ని నూడుల్స్?' అని ప్రశ్నించిన నెటిజన్లకు తనదైన శైలిలో సమాధనం చెప్పాడు వెన్ మింగ్.
అగ్నిమాపక శాఖలో ఉద్యోగంమంటే ఆషామాషీకాదని, రెస్క్యూ ఆపరేషన్ కు వెళితే ఎన్ని గంటలకు తిరిగొస్తామో చెప్పలేమని, పైగా తలపై హెల్మెట్, భుజానికి తాళ్లు తదితర 15 కిలోల బరువును మోయాల్సి ఉంటుందని అందుకే బలం అత్యవసరమని వెన్ మింగ్ చెప్పాడు. గిన్నెడు నూడుల్స్ తినడానికి ఒక రోజు ముందంతా తాను పనిలోనే ఉన్నానని, ఆకలిమీద ఎంత తింటున్నానో అర్థం కాలేదని అంటున్నాడు.