రాయిపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి ఉక్కు కార్మాగారంలో విషవాయువు లీకైన ఘటనలో ఇద్దరు డెప్యూటీ జనరల్ మేనేజర్లు సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో దుర్గ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ భిలాయి స్టీల్ ప్లాంట్లో ఉన్న ‘బ్లాస్ట్ ఫర్నేజ్-జీసీపీ’ నుంచి విషవాయువు లీక్ కావడం ప్రారంభమైందని, అది ఆ ఫర్నేజ్ దగ్గర్లో పనిచేస్తున్న వారిపై తీవ్ర ప్రభావం చూపిందని కార్మాగారం ఒక ప్రకటన విడుదల చేసింది. అస్వస్థతకు లోనైన వారిలో అధికారులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది, కార్మికులు ఉన్నారని పేర్కొంది.
ఘటనపై విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. బాధితులను ఆసుపత్రికి తరలించామని దుర్గ్ ప్రాంత ఐజీ ప్రదీప్ గుప్తా తెలిపారు. భిలాయి ఉక్కు కార్మాగారంలో జరిగిన ప్రమాదంపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.