Bhilai Steel Plant
-
పెళ్లి చేసుకోకపోయినా ఖర్చులు రాబట్టుకోవచ్చు! హైకోర్టు కీలక తీర్పు
రాయ్‌పూర్: వివాహం కానప్పటికీ కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి పెళ్లిఖర్చులను రాబట్టుకోవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, 1956లోని నిబంధనల ప్రకారం.. పెళ్లికాని కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి వివాహ ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 35 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బిలాస్‌పూర్‌లోని హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. తన తండ్రి నుంచి వివాహ ఖర్చులు ఇప్పించాలని ఆమె వేసిన పిటిషన్‌ను జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ సంజయ్ ఎస్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 21న విచారణకు అనుమతించిందని పిటిషనర్ న్యాయవాది ఎకె తివారి తెలిపారు. బిలాయ్ స్టీల్ ప్లాంట్(బీఎస్పీ) ఉద్యోగి అయిన తన తండ్రి భాను రామ్ కు పదవీ విరమణ ద్వారా రూ.55 లక్షలు రానున్నాయని.. ఇందులో తనకు రూ. 20 లక్షలు ఇచ్చేలా బీఎస్పీని ఆదేశించాలని 2016, జనవరి 7న దుర్గ్ జిల్లా కుటుంబ న్యాయస్థానాన్ని రాజేశ్వరి ఆశ్రయించారు. అయితే ఆమె అభ్యర్థనను జిల్లా కోర్టు తిరస్కరించింది. కుటుంబ న్యాయస్థానం ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. చట్టం ప్రకారం.. పెళ్లికాని కుమార్తె తన తండ్రి నుంచి వివాహ ఖర్చులను డిమాండ్ చేయవచ్చని.. ఆ ఖర్చు మెయింటెనెన్స్ పరిధిలోకి వస్తుందని హైకోర్టుకు విన్నవించినట్టు రాజేశ్వరి తరపు న్యాయవాది తివారి తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఈ తరహా తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి అని వెల్లడించారు. (క్లిక్: ఆ 72 మంది ఎంపీలతో ప్రధాని ఫొటో సెషన్) -
గ్యాస్‌పైప్ లైన్ పేలి ఆరుగురి మృతి
రాయ్‌పూర్ : చత్తీస్‌ఘడ్‌లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్‌పూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్టీల్ ప్లాంట్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేలడంతో ఆరుగురు మృతి చెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరీ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ప్లాంట్‌లోని కోక్ ఒవెన్ సెక్షన్ సమీపంలోని పైప్‌లైన్‌లో ఈ పేలుడు సంభవించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. 2014లో కూడా ఈ ప్లాంట్‌లో భారీ ప్రమాదం సంభవించింది. గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు సీనియర్ అధికారులతో సహా ఆరుగురు మృతి చెందారు. వాటర్ పంప్ హౌస్ బ్రేక్‌డౌన్ కావడంతో కార్బన్ మోనోక్సైడ్ విషవాయివు లీకయింది. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) పర్యవేక్షణలో నడిచే భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఈ ఏడాదే ఆధునీకరించారు. నవీకరించిన ఈ ప్లాంట్‌ను జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించారు. దేశంలోనే ఉత్తమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌గా భిలాయ్ స్టీల్ ప్లాంట్ గుర్తింపు పొందింది. -
హింసకు ప్రగతే పరిష్కారం
భిలాయ్: అన్ని రకాల హింస, కుట్రలకు అభివృద్ధి మాత్రమే ఏకైక పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో గురువారం రూ. 22 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న నక్సల్స్‌కు స్పష్టమైన సందేశమిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు అనేక పథకాల్ని ప్రారంభించాయని అన్నారు. యూపీఏ హయాంలో ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిని పట్టించుకోలేదని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భిలాయ్‌లో ఐఐటీ ఏర్పాటు చేశామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. అంతకుముందు భిలాయ్ ఉక్కు కర్మాగారం ఆధునిక విస్తరణ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆధునిక భారతదేశ పునాదులను బలోపేతం చేస్తుందని చెప్పారు. అలాగే జగదల్పూర్–రాయ్‌పూర్ మధ్య విమాన సేవల్ని, నయా రాయ్‌పూర్‌లో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ‘సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత స్థానిక గిరిజనుల కోసం ఖర్చుపెట్టాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌కు అదనంగా రూ. 3 వేల కోట్లు అందాయి. వాటిని ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తారు. గిరిజనులు, వెనకబడ్డ ప్రాంతాల్లో నివసించేవారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు. జగదల్పూర్–రాయ్‌పూర్ మధ్య విమాన సేవల ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ.. ‘హవాయ్ జహజ్(విమానం)లో హవాయి చెప్పులు వేసుకుని ఎవరైనా ప్రయాణిస్తే చూడాలనేది నా కల. చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విమాన సేవలు అందించడమే మేం ప్రారంభించిన ఉడాన్ పథకం లక్ష్యం. గత ప్రభుత్వం రోడ్లు కూడా నిర్మించని ప్రాంతాల్లో.. ఎన్డీఏ ప్రభుత్వం రోడ్లు, విమానాశ్రయాల్ని నిర్మిస్తోంది. ఇంతకముందు రాయ్‌పూర్ విమానాశ్రయంలో రోజుకు కేవలం ఆరు విమానాలు ఎగిరేందుకు అవకాశముందేది. ఇప్పుడు 50 విమానాల రాకపోకలకు సామర్థ్యం కల్పించాం’ అని మోదీ చెప్పారు. భిలాయ్ ఐఐటీని సాకారం చేశాం ఎప్పటి నుంచో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఐఐటీ కేటాయించమని సీఎం రమణ్ సింగ్ డిమాండ్ చేసినా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దానిని సాకారం చేశామని చెప్పారు. గతంలో చత్తీస్‌గఢ్ అంటే అడవులు, గిరిజనులే గుర్తుకు వచ్చే వారని, ఇప్పుడు స్మార్ట్ సిటీ(నయా రాయ్‌పూర్)కి పేరుగాంచిందన్నారు. బస్తర్ అనగానే బాంబులు, తుపాకీల పేర్లు మాత్రమే వినిపించేదని, ఇప్పుడు జగదల్పూర్లో నిర్మించిన విమానాశ్రయం అందరికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు. నవ భారతానికి పునాదులు ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ఆధునికీకరించిన భిలాయ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. నవ భారతానికి ఈ స్టీట్ ప్లాంట్ పునాదులు వేస్తుందని అన్నారు. దాదాపు రూ. 18,800 కోట్లతో విస్తరించిన ఈ స్టీల్ ప్లాంట్ సామర్థ్యం ఏడాదికి 4.7 మిలియన్ టన్నుల నుంచి 7.5 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం వరకూ ఉక్కు పరిశ్రమ ఇబ్బందుల్ని ఎదుర్కొందని, ఇప్పుడు ప్రపంచంలో భారత్ రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు. రూ. 72 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ కార్యక్రమంలో భిలాయ్ ప్లాంట్ అభివృద్ధిని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్) చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఉక్కు ఉత్పత్తి ఏడాదికి 13 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం 21 మిలియన్ టన్నులకు చేరుతుంది. బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు భిలాయ్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగదల్పూర్ నుంచి రాయ్‌పూర్‌కు మొదటి విమానాన్ని మోదీ ప్రారంభించారు. దీంతో మావోయిస్టులకు పేరుపడ్డ బస్తర్ జిల్లాకు తొలిసారి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. -
భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ప్రధాని
సాక్షి, రాయ్‌పూర్ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం చత్తీస్‌గఢ్ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. భిలాయ్‌లో ఆధునీకరించిన స్టీల్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని అంతకుముందు నగరంలో రోడ్‌షో నిర్వహించారు. నయా రాయ్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ప్రారంభించిన ప్రధాని భిలాయ్‌లో రోడ్‌షో చేపట్టారు. నగర వీధుల్లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకుసాగారు. స్టీల్ ప్లాంట్‌లో చేపట్టిన సమూల మార్పులను, విస్తరణ, ఆధునీకరణ తీరుతెన్నులను ఆసక్తిగా పరిశీలించారు. 1955లో సోవియట్ రష్యా సహకరాంతో ఏర్పాటైన భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఉత్పాదకత, నాణ్యత, పర్యావరణ అనుకూల ఉత్పత్తులను పెంచేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరణ ప్రక్రియను చేపట్టారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న చత్తీస్‌గఢ్‌లో ప్రధాని పర్యటించడం గత రెండు నెలల్లో ఇది రెండవ పర్యటన కావడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా ప్రధాని భిలాయ్‌లో ఐఐటీకి శంకుస్ధాపన చేయడంతో పాటు రాయ్‌పూర్-జగదల్పూర్ విమాన సర్వీసులను లాంఛనంగా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. -
హృదయం: మలుపు మలుపులోనూ ఉన్నదొక్కటే... ప్రేమ!
పెళ్లి తంతు ముగించేసరికే ఓ జీవితం పూర్తయినంత గొప్ప అనుభూతి కలిగింది. ఇక మా జీవన పయనంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించుకోగలమని, మేం కలకాలం సంతోషంగా జీవించగలమని నమ్మకం కుదిరింది. ఆమెది దక్షిణం. అతనిది ఉత్తరం. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే! వినడానికి చాలా సింపుల్‌గా అనిపించొచ్చు! కానీ ఈ కథలో ఎన్నో మలుపులున్నాయి. ఆ చిత్రమైన అనుభూతుల్ని, అనుభవాల్ని తన మాటల్లో వివరిస్తోంది చెన్నై అమ్మాయి అపర్ణ చంద్ర. మాది తమిళ బ్రాహ్మణ కుటుంబం. సంప్రదాయాలకు పెద్దపీట వేసినా, నా స్వేచ్ఛకు ఏనాడూ అడ్డు చెప్పలేదు అమ్మానాన్న. అప్పటికి నాకు 20 ఏళ్లు కూడా నిండలేదు. ఇంజనీరింగ్ చదువుతూ ఓ ప్రాజెక్టులో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు ఛత్తీస్‌ఘడ్‌లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లా. తొలి రెండు రోజులు అధికారులతో కలిసి పనిచేసేసరికి బోర్ కొట్టేసింది. మూడోరోజు... ఓ కుర్రాడు వచ్చాడు. అతని చురుకుదనం, పనితనం అన్నీ నాకు నచ్చాయి. అప్పటికిదాకా భారంగా గడుస్తున్న కాలం అతను రాగానే పరుగందుకుంది. కాసేపటి పరిచయం తర్వాత అతని పేరు వికాస్ అని, తనది జార్ఖండ్ అని తెలిసింది. ఎడారిలో ఒయాసిస్సులా కనిపించిన అతడితో పరిచయం కాగానే నేనే అడిగి నంబర్ తీసుకున్నా. సాయంత్రం నేనే ఫోన్ చేశా. మరుసటి రోజు లంచ్‌కు కలిశాం. తనకు తమిళం రాదు కానీ, నాకు హిందీ వచ్చు. దీంతో మా మధ్య మాటల ప్రవాహానికి అడ్డే లేకపోయింది. అక్కడున్నన్ని రోజులు ఎలా గడిచాయో తెలియదు. ఇద్దరం కలవని రోజు లేదు. మాట్లాడుకోని సమయం లేదు. కొన్ని రోజులకే మా బంధం చాలా బలపడిపోయింది. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నాం. అంతలోనే అతను నాకు ఐ లవ్యూ చెప్పాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. అయితే నా వయసు మరీ తక్కువ కావడంతో అప్పుడే పెళ్లేంటని అనిపించింది. ఏం చెప్పాలో తెలియలేదు. అదే సమయంలో నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు మొదలైంది నాలో అంతర్మథనం. వికాస్‌ను వదిలి వెళ్లడం నా వల్ల కాలేదు. అప్పుడే అర్థమైంది అతణ్ని విడిచి నేను ఉండలేనని. తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరం తల్లిదండ్రుల్ని ఒప్పించాలని ప్రయత్నించాం. మా ఇంటికి వెళ్లి విషయం చెప్పేశా. నేను ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటాననడంపై మావాళ్లు ఆశ్చర్యపోయారు. వికాస్‌తో పెళ్లికి ముందు కాస్త తటపటాయించినా, అతనప్పటికే బాగా స్థిరపడి ఉండటంతో సరేనన్నారు. వికాస్ నన్ను తీసుకెళ్లి వాళ్ల తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. నేను తమిళియన్ అయినా, చక్కగా హిందీలో మాట్లాడేసరికి వాళ్లు చాలా సంతోషించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, పెళ్లి సంగతి మాట్లాడేటప్పుడు మొదలయ్యాయి ఇబ్బందులు. మొదట నిశ్చితార్థం వరకు సింపుల్‌గా అయిపోయింది కానీ, పెళ్లి దగ్గరే వచ్చింది చిక్కు. మేం పెళ్లి మా సంప్రదాయం ప్రకారం చేయాలన్నాం. వాళ్లు ఒప్పుకోలేదు. బీహారి స్టైల్లోనే చేయాలన్నారు. మేం వెజిటేరియన్స్, పెళ్లిలో మాంసం అన్నది కలలోనూ ఊహించలేం. వాళ్లేమో అతిథులకు నాన్ వెజ్ తప్పనిసరి అన్నారు. మాకు భోజనాలు అరటాకులపై పెట్టడం అలవాటు. వాళ్లు బఫే అన్నారు. మేం తెల్లవారుజామున ముహూర్తం కావాలన్నాం. వాళ్లు రాత్రి ముహూర్తం చూసుకున్నారు. పెళ్లిలో మెహందీ అన్నారు, సంగీత్ అన్నారు, నా నుదుటిపై సిందూరం దిద్దారు, లక్క గాజులు తొడిగారు. మా వాళ్లంతా సిల్క్ చీరలు కడితే, వాళ్లు డిజైనర్ చీరల్లో వచ్చారు. నా కజిన్స్ పెళ్లికొడుక్కి షూ తొడిగి, డబ్బులడిగితే, వాళ్లు వింతగా చూశారు. ఇలా అంతా కొత్తకొత్తగా సాగిపోయింది మా పెళ్లి. అయితే ఇంత వైరుధ్యమున్నా, ఒకరి సంప్రదాయాల్ని ఒకరం గౌరవించాం. ఎక్కడా ఏ గొడవా రాకుండా పెళ్లి కానిచ్చాం. ఆశ్చర్యకరంగా అప్పగింతల సమయంలోనూ మా తల్లిదండ్రులు బెంగపడలేదు. పెళ్లి తంతు ముగించేసరికే ఓ జీవితం పూర్తయినంత గొప్ప అనుభూతి కలిగింది. ఇక మా జీవన పయనంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించుకోగలమని, మేం కలకాలం సంతోషంగా జీవించగలమని నమ్మకం కుదిరింది. 2007లో పెళ్లి చేసుకున్న మాకు 2010లో బాబు పుట్టాడు. వాడి పేరు అక్షత్ చంద్ర. మేమిద్దరం పరస్పరం భాష, సంస్కృతి, సంప్రదాయాల్ని గౌరవించుకోవడం, సర్దుబాట్లు చేసుకోవడం నేర్చుకున్నాం. తనకు నచ్చింది తను తింటే, నాకు నచ్చింది నేను తింటా. మా బాబుకు నచ్చింది వాడికి పెడతాం. ఈ ఏడేళ్ల జీవితం నాకెన్నో అనుభవాల్ని మిగిల్చింది. మున్ముందు మరెన్నో గొప్ప అనుభూతుల్ని అందిస్తున్న ఆశ నాలో ఉంది. -
భిలాయ్ ఉక్కు కర్మాగారంలో గ్యాస్ లీక్
-
భిలాయి ఉక్కు కార్మాగారంలో విషవాయువు లీకేజీ
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయి ఉక్కు కార్మాగారంలో విషవాయువు లీకైన ఘటనలో ఇద్దరు డెప్యూటీ జనరల్ మేనేజర్లు సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. 30 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో దుర్గ్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ భిలాయి స్టీల్ ప్లాంట్‌లో ఉన్న ‘బ్లాస్ట్ ఫర్నేజ్-జీసీపీ’ నుంచి విషవాయువు లీక్ కావడం ప్రారంభమైందని, అది ఆ ఫర్నేజ్ దగ్గర్లో పనిచేస్తున్న వారిపై తీవ్ర ప్రభావం చూపిందని కార్మాగారం ఒక ప్రకటన విడుదల చేసింది. అస్వస్థతకు లోనైన వారిలో అధికారులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, కార్మికులు ఉన్నారని పేర్కొంది. ఘటనపై విచారణ జరిపేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించింది. బాధితులను ఆసుపత్రికి తరలించామని దుర్గ్ ప్రాంత ఐజీ ప్రదీప్ గుప్తా తెలిపారు. భిలాయి ఉక్కు కార్మాగారంలో జరిగిన ప్రమాదంపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.