హింసకు ప్రగతే పరిష్కారం | PM Inaugurates Bhilai Steel Plant, Addresses Public Rally | Sakshi
Sakshi News home page

హింసకు ప్రగతే పరిష్కారం

Published Fri, Jun 15 2018 3:01 AM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

PM Inaugurates Bhilai Steel Plant, Addresses Public Rally - Sakshi

ఆధునీకరించిన భిలాయ్‌ ఉక్కు కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తున్న మోదీ

భిలాయ్‌: అన్ని రకాల హింస, కుట్రలకు అభివృద్ధి మాత్రమే ఏకైక పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో గురువారం రూ. 22 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల్ని ప్రారంభించిన అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న నక్సల్స్‌కు స్పష్టమైన సందేశమిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని, అభివృద్ధే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వాలు అనేక పథకాల్ని ప్రారంభించాయని అన్నారు.

యూపీఏ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ అభివృద్ధిని పట్టించుకోలేదని, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భిలాయ్‌లో ఐఐటీ ఏర్పాటు చేశామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని ప్రధాని వెల్లడించారు. అంతకుముందు భిలాయ్‌ ఉక్కు కర్మాగారం ఆధునిక విస్తరణ ప్లాంటును ఆయన ప్రారంభించారు. ఈ కర్మాగారం ఆధునిక భారతదేశ పునాదులను బలోపేతం చేస్తుందని చెప్పారు. అలాగే జగదల్‌పూర్‌–రాయ్‌పూర్‌ మధ్య విమాన సేవల్ని, నయా రాయ్‌పూర్‌లో కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు.

ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్‌లో నెలరోజుల వ్యవధిలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది రెండోసారి కావడం గమనార్హం.   ‘సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో కొంత స్థానిక గిరిజనుల కోసం ఖర్చుపెట్టాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్‌కు అదనంగా రూ. 3 వేల కోట్లు అందాయి. వాటిని ఆస్పత్రులు, పాఠశాలలు, రహదారులు, మరుగుదొడ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తారు. గిరిజనులు, వెనకబడ్డ ప్రాంతాల్లో నివసించేవారి ఆదాయం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని ప్రధాని పేర్కొన్నారు.

జగదల్‌పూర్‌–రాయ్‌పూర్‌ మధ్య విమాన సేవల ప్రారంభాన్ని ప్రస్తావిస్తూ.. ‘హవాయ్‌ జహజ్‌(విమానం)లో హవాయి చెప్పులు వేసుకుని ఎవరైనా ప్రయాణిస్తే చూడాలనేది నా కల. చిన్న నగరాలు, పట్టణాలకు కూడా విమాన సేవలు అందించడమే మేం ప్రారంభించిన ఉడాన్‌ పథకం లక్ష్యం. గత ప్రభుత్వం రోడ్లు కూడా నిర్మించని ప్రాంతాల్లో.. ఎన్డీఏ ప్రభుత్వం రోడ్లు, విమానాశ్రయాల్ని నిర్మిస్తోంది. ఇంతకముందు రాయ్‌పూర్‌ విమానాశ్రయంలో రోజుకు కేవలం ఆరు విమానాలు ఎగిరేందుకు అవకాశముందేది. ఇప్పుడు 50 విమానాల రాకపోకలకు సామర్థ్యం కల్పించాం’ అని మోదీ చెప్పారు.  

భిలాయ్‌ ఐఐటీని సాకారం చేశాం
ఎప్పటి నుంచో చత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి ఐఐటీ కేటాయించమని సీఎం రమణ్‌ సింగ్‌ డిమాండ్‌ చేసినా యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదని.. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దానిని సాకారం చేశామని చెప్పారు. గతంలో చత్తీస్‌గఢ్‌ అంటే అడవులు, గిరిజనులే గుర్తుకు వచ్చే వారని, ఇప్పుడు స్మార్ట్‌ సిటీ(నయా రాయ్‌పూర్‌)కి పేరుగాంచిందన్నారు. బస్తర్‌ అనగానే బాంబులు, తుపాకీల పేర్లు మాత్రమే వినిపించేదని, ఇప్పుడు జగదల్‌పూర్‌లో నిర్మించిన విమానాశ్రయం అందరికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.  

నవ భారతానికి పునాదులు
ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలో భాగంగా ఆధునికీకరించిన భిలాయ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. నవ భారతానికి ఈ స్టీట్‌ ప్లాంట్‌ పునాదులు వేస్తుందని అన్నారు. దాదాపు రూ. 18,800 కోట్లతో విస్తరించిన ఈ స్టీల్‌ ప్లాంట్‌ సామర్థ్యం ఏడాదికి 4.7 మిలియన్‌ టన్నుల నుంచి 7.5 మిలియన్‌ టన్నులకు పెరుగుతుంది. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్ర సింగ్‌ మాట్లాడుతూ.. నాలుగేళ్ల క్రితం వరకూ ఉక్కు పరిశ్రమ ఇబ్బందుల్ని ఎదుర్కొందని, ఇప్పుడు ప్రపంచంలో భారత్‌ రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి దేశంగా నిలిచిందన్నారు. రూ. 72 వేల కోట్లతో స్టీల్‌ ప్లాంట్ల ఆధునీకరణ, విస్తరణ కార్యక్రమంలో భిలాయ్‌ ప్లాంట్‌ అభివృద్ధిని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సెయిల్‌) చేపట్టింది. ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఉక్కు ఉత్పత్తి ఏడాదికి 13 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం 21 మిలియన్‌ టన్నులకు చేరుతుంది.  

బస్తర్‌ జిల్లాకు తొలిసారి విమాన సేవలు
భిలాయ్‌ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జగదల్‌పూర్‌ నుంచి రాయ్‌పూర్‌కు మొదటి విమానాన్ని మోదీ ప్రారంభించారు. దీంతో మావోయిస్టులకు పేరుపడ్డ బస్తర్‌ జిల్లాకు తొలిసారి విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement