న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్ల కాలంలో తమ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని ప్రధాని మోదీ చెప్పారు. వచ్చే తొమ్మిది నెలల కాలంలో ఈ పనుల గురించి ప్రజలకు వివరించాలని మంత్రివర్గ సహచరులను ఆయన కోరారు. సోమవారం రాత్రి ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో మోదీ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రధానిమాట్లాడారు.
2047లో వందో స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే నాటికి మౌలిక వసతులు మొదలుకొని బడ్జెట్ పరిమాణం వరకు ప్రగతి ప్రయాణాన్ని వివరించే పవర్ ప్రజెంటేషన్ కూడా జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటి నుంచి 2047వ సంవత్సరం వరకు స్వర్ణయుగం, అమృత్ కాల్‌గా ప్రధాని మోదీ పేర్కొంటున్న విషయం తెలిసిందే. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించిన ప్రధాని, అదే సమయంలో దేశం సాధించిన ప్రగతిని ప్రశంసించారు. విదేశాంగ, రక్షణ సహా పలు మంత్రిత్వ శాఖలకు చెందిన కార్యదర్శులు కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల ప్రధాని మోదీ అమెరికా, ఈజిప్టు దేశాల్లో పర్యటనల సందర్భంగా సాధించిన విజయాలను వారు వివరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ కేటాయింపులను సరిగ్గా వినియోగించుకోవడమెలాగనే అంశంపైనా చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ ట్విట్టర్‌లో..‘కేబినెట్ సమావేశం ఫలప్రదంగా సాగింది. వివిధ విధివిధానాలపై అభిప్రాయాలను పంచుకున్నాం’ అని పేర్కొన్నారు. త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనుండటం, ఇటీవల బీజేపీ అగ్ర నాయకత్వం వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కేబినెట్ భేటీ చర్చిస్తుందన్న వార్తలు గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారమవుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment