హృదయం: మలుపు మలుపులోనూ ఉన్నదొక్కటే... ప్రేమ!
పెళ్లి తంతు ముగించేసరికే ఓ జీవితం పూర్తయినంత గొప్ప అనుభూతి కలిగింది. ఇక మా జీవన పయనంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించుకోగలమని, మేం కలకాలం సంతోషంగా జీవించగలమని నమ్మకం కుదిరింది. ఆమెది దక్షిణం. అతనిది ఉత్తరం. ఇద్దరూ పెళ్లి చేసుకుంటే! వినడానికి చాలా సింపుల్‌గా అనిపించొచ్చు! కానీ ఈ కథలో ఎన్నో మలుపులున్నాయి. ఆ చిత్రమైన అనుభూతుల్ని, అనుభవాల్ని తన మాటల్లో వివరిస్తోంది చెన్నై అమ్మాయి అపర్ణ చంద్ర.
మాది తమిళ బ్రాహ్మణ కుటుంబం. సంప్రదాయాలకు పెద్దపీట వేసినా, నా స్వేచ్ఛకు ఏనాడూ అడ్డు చెప్పలేదు అమ్మానాన్న. అప్పటికి నాకు 20 ఏళ్లు కూడా నిండలేదు. ఇంజనీరింగ్ చదువుతూ ఓ ప్రాజెక్టులో భాగంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనేందుకు ఛత్తీస్‌ఘడ్‌లోని భిలాయ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లా. తొలి రెండు రోజులు అధికారులతో కలిసి పనిచేసేసరికి బోర్ కొట్టేసింది. మూడోరోజు... ఓ కుర్రాడు వచ్చాడు. అతని చురుకుదనం, పనితనం అన్నీ నాకు నచ్చాయి. అప్పటికిదాకా భారంగా గడుస్తున్న కాలం అతను రాగానే పరుగందుకుంది.
కాసేపటి పరిచయం తర్వాత అతని పేరు వికాస్ అని, తనది జార్ఖండ్ అని తెలిసింది. ఎడారిలో ఒయాసిస్సులా కనిపించిన అతడితో పరిచయం కాగానే నేనే అడిగి నంబర్ తీసుకున్నా. సాయంత్రం నేనే ఫోన్ చేశా. మరుసటి రోజు లంచ్‌కు కలిశాం. తనకు తమిళం రాదు కానీ, నాకు హిందీ వచ్చు. దీంతో మా మధ్య మాటల ప్రవాహానికి అడ్డే లేకపోయింది. అక్కడున్నన్ని రోజులు ఎలా గడిచాయో తెలియదు. ఇద్దరం కలవని రోజు లేదు. మాట్లాడుకోని సమయం లేదు. కొన్ని రోజులకే మా బంధం చాలా బలపడిపోయింది.
ఒకర్ని విడిచి ఒకరు ఉండలేని స్థితికి చేరుకున్నాం. అంతలోనే అతను నాకు ఐ లవ్యూ చెప్పాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. అయితే నా వయసు మరీ తక్కువ కావడంతో అప్పుడే పెళ్లేంటని అనిపించింది. ఏం చెప్పాలో తెలియలేదు. అదే సమయంలో నాకు ఢిల్లీలో ఉద్యోగం వచ్చింది. అప్పుడు మొదలైంది నాలో అంతర్మథనం. వికాస్‌ను వదిలి వెళ్లడం నా వల్ల కాలేదు. అప్పుడే అర్థమైంది అతణ్ని విడిచి నేను ఉండలేనని. తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇద్దరం తల్లిదండ్రుల్ని ఒప్పించాలని ప్రయత్నించాం.
మా ఇంటికి వెళ్లి విషయం చెప్పేశా.
నేను ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటాననడంపై మావాళ్లు ఆశ్చర్యపోయారు. వికాస్‌తో పెళ్లికి ముందు కాస్త తటపటాయించినా, అతనప్పటికే బాగా స్థిరపడి ఉండటంతో సరేనన్నారు. వికాస్ నన్ను తీసుకెళ్లి వాళ్ల తల్లిదండ్రులకు పరిచయం చేశాడు. నేను తమిళియన్ అయినా, చక్కగా హిందీలో మాట్లాడేసరికి వాళ్లు చాలా సంతోషించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, పెళ్లి సంగతి మాట్లాడేటప్పుడు మొదలయ్యాయి ఇబ్బందులు. మొదట నిశ్చితార్థం వరకు సింపుల్‌గా అయిపోయింది కానీ, పెళ్లి దగ్గరే వచ్చింది చిక్కు. మేం పెళ్లి మా సంప్రదాయం ప్రకారం చేయాలన్నాం. వాళ్లు ఒప్పుకోలేదు. బీహారి స్టైల్లోనే చేయాలన్నారు. మేం వెజిటేరియన్స్, పెళ్లిలో మాంసం అన్నది కలలోనూ ఊహించలేం. వాళ్లేమో అతిథులకు నాన్ వెజ్ తప్పనిసరి అన్నారు. మాకు భోజనాలు అరటాకులపై పెట్టడం అలవాటు. వాళ్లు బఫే అన్నారు. మేం తెల్లవారుజామున ముహూర్తం కావాలన్నాం. వాళ్లు రాత్రి ముహూర్తం చూసుకున్నారు. పెళ్లిలో మెహందీ అన్నారు, సంగీత్ అన్నారు, నా నుదుటిపై సిందూరం దిద్దారు, లక్క గాజులు తొడిగారు. మా వాళ్లంతా సిల్క్ చీరలు కడితే, వాళ్లు డిజైనర్ చీరల్లో వచ్చారు. నా కజిన్స్ పెళ్లికొడుక్కి షూ తొడిగి, డబ్బులడిగితే, వాళ్లు వింతగా చూశారు. ఇలా అంతా కొత్తకొత్తగా సాగిపోయింది మా పెళ్లి. అయితే ఇంత వైరుధ్యమున్నా, ఒకరి సంప్రదాయాల్ని ఒకరం గౌరవించాం. ఎక్కడా ఏ గొడవా రాకుండా పెళ్లి కానిచ్చాం. ఆశ్చర్యకరంగా అప్పగింతల సమయంలోనూ మా తల్లిదండ్రులు బెంగపడలేదు.
పెళ్లి తంతు ముగించేసరికే ఓ జీవితం పూర్తయినంత గొప్ప అనుభూతి కలిగింది. ఇక మా జీవన పయనంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పరిష్కరించుకోగలమని, మేం కలకాలం సంతోషంగా జీవించగలమని నమ్మకం కుదిరింది. 2007లో పెళ్లి చేసుకున్న మాకు 2010లో బాబు పుట్టాడు. వాడి పేరు అక్షత్ చంద్ర. మేమిద్దరం పరస్పరం భాష, సంస్కృతి, సంప్రదాయాల్ని గౌరవించుకోవడం, సర్దుబాట్లు చేసుకోవడం నేర్చుకున్నాం. తనకు నచ్చింది తను తింటే, నాకు నచ్చింది నేను తింటా. మా బాబుకు నచ్చింది వాడికి పెడతాం. ఈ ఏడేళ్ల జీవితం నాకెన్నో అనుభవాల్ని మిగిల్చింది. మున్ముందు మరెన్నో గొప్ప అనుభూతుల్ని అందిస్తున్న ఆశ నాలో ఉంది.