బెంగళూరులో దారుణం
ఐదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం
బనశంకరి (కర్ణాటక): సిలికాన్ సిటీ బెంగళూరులో ఐదేళ్ల చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన శుక్రవారం అర్ధరాత్రి కాడుగొండనహళ్లిలో చోటుచేసుకుంది. చిత్రదుర్గ నుంచి రెండేళ్ల క్రితం భార్యభర్తలు తమ పాపతో కలసి జీవనోపాధి నిమిత్తం బెంగళూరుకు వచ్చారు. కేజీ హళ్లిలోని వయ్యాలికావల్ సొసైటీ వద్ద ఓ అద్దె ఇంట్లో ఉంటూ గారపనికి వెళ్లేవారు.
శుక్రవారం అర్ధరాత్రి బాలిక మూత్ర విసర్జన నిమిత్తం ఇంట్లో నుంచి బయటికి రాగా, నలుగురు దుండగులు చిన్నారిని నిర్జన ప్రదేశంలోకి ఎత్తుకెళ్లి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం చిన్నారిని ఇంటి సమీపంలో పడేసి వెళ్లిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో గస్తీ తిరుగుతున్న పోలీసులు గుర్తించి బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలికకు అత్యవసర వార్డులో చికిత్స అందిస్తున్నారు. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
షాక్‌లో చిన్నారి
అత్యాచారానికి గురైన చిన్నారి తీవ్ర షాక్‌లో ఉందని, ప్రస్తుతం బాలిక మాట్లాడే పరిస్థితిలో లేదని బౌరింగ్ ఆస్పత్రి డైరెక్టర్ డీన్ మంజునాథ్ తెలిపారు. శనివారం ఉదయం తల్లిదండ్రులు నిద్రలేచి చూడగా కుమార్తె కనబడకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. కేజీ హళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా వారికి ఘోరం గురించి తెలిసింది. దుండగులు పరారీలో ఉన్నారు. కాగా, రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి కేజే జార్జ్ ఆస్పత్రికి వెళ్లి బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలికకు సరైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు.