
నిరుద్యోగులకు ఫ్లిప్‌కార్ట్ తీపి కబురు
న్యూఢిల్లీ: మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన పోటీ కారణంగా ఒకవైపు ఈ రీటైలర్స్ దుకాణాలను మూసివేయడమో, లేదా ఉద్యోగులకు ఇంటికి పంపించడమో లాటి నిర్ణయాలను తీసుకుంటోందే.. దేశీయ ఇ- కామర్స్ దిగ్గజం, బెంగళూరు ఆధారిత సంస్థ ఫ్లిప్‌కార్ట్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ప్రధానంగా ఇ-కామర్స్ దిగ్గజం, ప్రత్యర్థి స్నాప్‌డీల్ భారీ ఎత్తున పింక్ స్లిప్పులు ఇచ్చి ఉద్యోగులను వదిలించుకుంటోంటే..ఫ్లిప్‌కార్ట్ ఇందుకు భిన్నంగా వ్యవహరించనుంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది.
ముఖ్యంగా ఇండియన్ మార్కెట్ లో పాగా వేసిన అమెరికాకు చెందిన అమెజాన్ చెక్‌పెట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఫ్లిప్ కార్ట్ 2017 తమ వ్యాపారం జోరందుకోనుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే 2017 లో 20-30 శాతం ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకోవాలని చూస్తున్నట్టు ప్రకటించింది. తమకార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో అవసరాల రీత్యా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు సంస్థ సిఒఒ నితిన్ సేథ్ పిటిఐకి చెప్పారు. అయితే గత ఏడాది, ప్రస్తుత ఏడాది నియామక వివరాలను చెప్పడానికి మాత్రం ఆయన నిరాకరించారు. గత ఏడాది 1500మందిని నియమించుకున్నట్టు తెలుస్తోంది.
పరిశోధన సంస్థ రెడ్‌సీర్ ప్రకారం భారతీయ ఇ-కామర్స్ పరిశ్రమ 2015 లో ఏకంగా 180 శాతం వృద్ధి చెందగా, 2016 లో ఒక కేవలం 12 శాతం మేర అభివృద్ధి చెందింది. మరోవైపు పండగల సీజన్ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో 10 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంది. మార్కెట్ లో తీవ్రమైన పోటీ, ఆదాయంలో క్షీణత తదితర కారణాల రీత్యా ఇటీవల స్నాప్‌డీల్ ఉద్యోగాల్లో భారీ కోతతో పాటు, కో ఫౌండర్స్ కూడా తమ జీతాలను వదులుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.